సంస్కృతీసంప్రదాయాలకు పెట్టింది పేరైన భారత దేశంలో పాశ్యాత్య సంస్కృతి నానాటికీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. పాశ్యాత్య సంస్కృతికితోడు ఆధునిక యుగంలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, సోషల్ మీడియా నేపథ్యంలో వివాహేతర సంబంధాలు, వ్యభిచారం వంటివి విచ్చలవిడిగా సాగుతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒక గదిలో తలుపులు వేసుకొని ఉంటే…వారు ఎవరు, ఏమిటి, అక్కడ ఎందుకున్నారు అన్న ప్రశ్నలకు బదులుగా….వారిద్దరూ అక్రమ సంబంధం నేపథ్యంలోనే తలుపులు మూసుకొని గదిలో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న రోజులివి. అయితే, అనుమానానికి, వాస్తవానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని గుర్తెరిగేవారు కొందరే ఉంటారు. ఈ క్రమంలోనే ఒక గదిలో ఒక స్త్రీ, ఒక పురుషుడు తలుపులు వేసుకొని ఉన్నంత మాత్రాన వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని భావించలేమని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
ఓ సాయుధ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్త్రీ, పురుషులిద్దరూ ఒకే ఇంటిలో ఒకే గదిలో ఉన్నంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. 1998లో కే శరవణ బాబు అనే సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ తన క్వార్టర్లో మరో మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఉన్నారు. దీంతో, వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది కనుకే తలుపులు వేసుకున్నారని ఉన్నతాధికారులు ఆరోపించారు. అంతేకాదు, ఆ కారణంతో శరవణ బాబును విధుల నుంచి తొలగించడంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తమ ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయమని, తమపై ఇటువంటి ఆరోపణలు చేయటం ఎంత వరకూ సరైనదని కోర్టులో మొర పెట్టుకున్నాడు. దీంతో, ఈ కేసును విచారణ జరిపిన కోర్టు…. ఊహాతీత కథనాలతో క్రమశిక్షణా చర్యలు విధించడం, నిందలు మోపటం సరి కాదని చెప్పింది. ఒక గదిలో ఒక స్త్రీ, ఒక పురుషుడు తలుపులు వేసుకొని ఉన్నంత మాత్రాన వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని భావించలేమని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.