వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుతం టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు.. మాజీ సీఎం జగన్ సహా.. ఇతర ఐపీఎస్ అధికారులు, ఓ డాక్టర్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై హత్యాయత్నం జరిగిందని.. తనను చంపేయాలని కుట్ర చేశారని.. లాఠీలతో కొడుతూ.. గుండెలపై కూర్చుని ఊపిరి ఆగిపోయేలా చేశారన్నది ఆయన చేసిన ప్రధాన ఫిర్యాదు. ఈ వివరాల ఆధారంగా గుంటూరు పోలీసులు.. మాజీ సీఎం జగన్‌ను ఏ-3గా పేర్కొంటూ.. హత్యాయత్నం(307 సెక్షన్ ఐపీసీ) కింద కేసు పెట్టారు. ఇది సంచలనమేనని చెప్పారు.
అయితే.. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. ఇది వర్కవుట్ అవుతుందా? జగన్‌పై నమోదు చేసిన కేసును కోర్టులు పరిగణన లోకి తీసుకుంటాయా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అనుసరించి.. ఏ కేసులో అయినా.. రాజకీయ జోక్యం ఉండకూడదు. ఉంటే.. అలాంటి కేసులను పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదు. ఈ కేసులో రాజకీయ జోక్యం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత రఘురామపైనే ఉంటుంది. కానీ..ఇక్కడే ఆయనకు కొన్ని చిక్కులు ఎదురయ్యే పరిస్థితి ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గతంలో వైసీపీలో ఉండడం. ఎంపీగా గెలవడంతోపాటు.. పార్టీలో తలెత్తిన విభేధాలతోనే ఆయన జగన్‌కు దూరమయ్యారు.
ఆ తర్వాత.. జగన్‌ను ఆయన పాలనను విమర్శిస్తూ.. మీడియాలో మాట్లాడారు. సెల్ఫీవీడియోలు విడుదల చేశారు. వీటిని వైసీపీ అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. సో.. దీనిని కాదని.. ఈ వీడియోల్లో తానుజగన్పై ఎలాంటి విమర్శలు చేయలేదని.. తనకురాజకీయ కక్ష సాధింపులు తెలియని రఘురామ నిరూపించాల్సి ఉంటుందని అంటున్నారు. మరో ముఖ్యమైన విషయం.. ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యాన్ని చెల్లదని సుప్రీంకోర్టు గతంలో ముంబై దాడుల కేసులో చెప్పింది. తర్వాత.. మహారాష్ట్ర రాజకీయ వివాదాల్లోనూ తేల్చి చెప్పింది. ఇప్పుడు రఘురామ కేసును చూస్తే.. రెండున్నరేళ్లు అయింది. ఈ నేపథ్యంలో కోర్టులు ఏమేరకు ఈ కేసును పరిగణనలోకి తీసుకుంటాయో చూడాలి.
ఇక, రఘురామ పెట్టినకేసును పరిగణనలోకి తీసుకుంటే.. ఆయన గతంలో చెప్పిన వాదానికీ.. ఇప్పుడు పేర్కొన్న విషయాలకు మధ్య సంబంధం కనిపించడం లేదు. గతంలో మాస్కులు పెట్టుకుని కొందరు తనను హింసించారని చెప్పారు. దీనిని అప్పట్లో కోర్టులు కూడా నమోదు చేసుకున్నాయి. కానీ, ఇప్పుడు దాడి చేసినవారు.. అధికారులేనని.. అయితే వారి పేర్లు తనకు తెలియవని చెప్పారు. ఈ రెండు విరుద్ధమైన వాదనలుగా ఉన్నాయి. దీంతో ఈ కేసు ఏమేరకు న్యాయ వ్యవస్థ ముందు నిలబడుతుందనేది చూడాలి. అయితే.. ఇప్పటి వరకు ఏ మాజీ ముఖ్యమంత్రిపైనా హత్యాయత్నం కేసు నమోదు కాకపోవడం.. జగన్‌పైనే 307 నమోదు కావడంగమనార్హం. దీనిని కూడా కోర్టులు సీరియస్‌గా ప్రశ్నించే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.