పంచాయతీరాజ్ వ్యవస్థను ధ్వంసం చేసి.. ప్రజాధనాన్ని కార్యకర్తలకు కట్టబెట్టేందుకు నవ్యాంధ్రలో సీఎం జగన్ తీసుకొచ్చిన గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( కాగ్ ) తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాదు.. జగన్ నిర్వాకం కారణంగా రాజధాని అమరావతి నిర్వీర్యమైందని.. 2019 వరకు దానిపై పెట్టిన ఖర్చు నిరర్థకమైందని తన తాజా నివేదికలో ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రధానంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని తీవ్రంగా వ్యాఖ్యానించింది. వార్డు సచివాలయాలను రాజ్యాంగబద్ధమైన వార్డు కమిటీలు, ప్రాంతీయ సభలకు జవాబుదారీగా చేసి, రాజ్యాంగంలో ఏకీకృతం చేయాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది.
‘రాజ్యాంగపరంగా ఏర్పాటు చేయాల్సిన వార్డు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దానికిబదులుగా సచివాలయాలను ప్రవేశపెట్టింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అందులో భాగస్వామ్యం లేదు. ఈ చర్య స్థానిక స్వపరిపాలన కోసం ఉద్దేశించిన రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చింది’ అని కాగ్ ఆక్షేపించింది. 2019 జూలైలో జగన్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్రం, జిల్లా, పట్టణ స్థానిక సంస్థల వలే వార్డును ఒక పరిపాలనావిభాగంగా చేసింది. ఒక్కో వార్డు సచివాలయంలో 10 మంది వార్డు కార్యదర్శుల చొప్పున 37,860 పోస్టులతో ప్రభుత్వం 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న బిల్ కలెక్టర్, వర్క్ ఇన్స్పెక్టర్, ట్యాప్ ఇన్స్పెక్టర్, ఫిట్టర్, టీపీ ట్రేసర్ పోస్టులను అందులో విలీనం చేశారు. ఇవి మొత్తం 2,434 పోస్టులు. అలాగే, ఇంటర్వ్యూల ద్వారా 70,888 వలంటీర్లను ఎంపిక చేసింది.
పురపాలక చట్టాల ఉల్లంఘన..
వార్డు స్థాయిలో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయడం పురపాలక చట్టాలకు అనుగుణంగా లేదని కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం వల్ల రాజ్యాంగంలో నిర్దేశించినట్లు పౌరులకు, పాలనకు మధ్య వారధిగా ఉండాలనే వార్డు కమిటీ ఉద్దేశాన్ని, రాజ్యాంగ నిబంధనలను జగన్ ప్రభుత్వం నీరుగార్చింది. వార్డు కమిటీలు/ప్రాంతీయ సభల లాంటి వ్యవస్థల్లో నిర్దేశించినట్టు ఎన్నికైన ప్రతినిధులు లేదా పౌరసమాజ సభ్యుల భాగస్వామ్యం లేనందున, వాటి ఏర్పాటు ఆమోదయోగ్యం కాదు’ అని తేల్చింది. ఆస్తి పన్ను వసూలు చేసే అధికారం పట్టణ స్థానిక సంస్థలకు ఉన్నప్పటికీ, పన్నురేట్లు, వాటి సవరణ, వసూలు చేసే విధానం, మినహాయింపులు లాంటి విషయాల్లో నిర్ణయాధికారం ప్రభుత్వం వద్దే ఉందని తెలిపింది.
దానివల్ల సొంత రాబడిని సమకూర్చుకోవడంలో స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి లేకుండా పోయిందని పేర్కొంది. తణుకు పురపాలక సంఘంలో నాలుగు గ్రామాలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయగా హైకోర్టు వాటిని కొట్టేసింది. కానీ ఈ 4 గ్రామాల్లో తణుకు పురపాలక సంఘం పన్నులు వసూలు చేస్తోందని కాగ్ ఆక్షేపించింది.
అమరావతి నిరుపయోగం..
ప్రపంచస్థాయి నగరం నిర్మించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన రాజధాని అమరావతి నగర నిర్మాణం ప్రభుత్వం మారిన తర్వాత మారిన విధానాలతో నిరుపయోగమైందని కాగ్ అభిప్రాయపడింది. వేల కోట్లు వెచ్చించి, అనేక ప్రయాసలకోర్చి ప్రజల నుంచి సమీకరించిన భూమి ఖాళీగా పడిఉందని తెలిపింది. 2019 మే వరకు పెట్టిన ఖర్చంతా ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిష్ఫలమైందని, అప్పటి వరకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేపట్టిన నిర్మాణాలు, ఇతర పనులు నిరర్థకంగా మిగిలాయని పేర్కొంది. ప్రభుత్వం మారాక రాజధాని అమరావతిపై విధానపరమైన మార్పు ఫలితంగా 2019 మే నుంచి ఇప్పటికీ 55 ప్రతిపాదనలపై అనిశ్చితి నెలకొంది.
భూసమీకరణ కోసం ఏపీసీఆర్డీఏ నుంచి రూ.2244 కోట్లు ఖర్చు చేయగా ప్రభుత్వం మారడంతో సేకరించిన భూమి అభివృద్ధి లేకుండా నిరుపయోగంగా ఉంది. భూసమీకరణ లక్ష్యం నెరవేరలేదు. ఈ భూముల్లో ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనలకు రూ.13,802 కోట్లు ఖర్చు అంచనా వేయగా.. కేవలం రూ.183 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ.3,213 కోట్ల ఖర్చు తర్వాత అత్యంత ప్రాధాన్యమైన మౌలికసదుపాయాల ప్రతిపాదనలు మే 2019 తర్వాత ఆగిపోయాయి. రూ.270.38 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేసిన పైపులు నిరుపయోగంగా పడిఉన్నాయి. ప్రజావేదిక కూల్చివేతతో రూ.11 కోట్లు వృథా అయినట్లు ధ్వజమెత్తింది.
జరిగిన పనులు ఇంతే..
జాతీయరహదారుల ట్రాఫిక్ పరిమాణంలో 50 శాతం రాకపోకలు జరిగే సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రస్తుత 4 వరుసల నుంచి 9 వరుసలు చేసేందుకు రహదారి విస్తరణ పనులను తలపెట్టారు. కానీ, ఇప్పటి వరకు సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారులకు అనుసంధానం చేయకపోవడం వల్ల దీనిపై చేసిన రూ.44.24 కోట్ల ఖర్చు నిఫ్ఫలమైంది. రూ.6848 కోట్ల వ్యయం అంచనాతో 19 ప్రభుత్వ భవనాల నిర్మాణం ఉండగా, రూ.526.74 కోట్ల విలువైన రెండు భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 17 ప్రతిపాదనలకు సంబంధించి రూ.1505.55 కోట్లు ఖర్చు చేయగా, వాటిలో సున్నా నుంచి 95 శాతం పురోగతి మాత్రమే ఉంది.
220 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్స్ రీ రూటింగ్ కోసం రూ.208.67 కోట్లు పెట్టి కొన్న సామాగ్రి నిరుపయోగంగా ఉంది. అలాగే 400 కేవీ లైన్ల రీ రూటింగ్ కోసం ఖర్చు పెట్టిన రూ.60 కోట్ల పనులు నిలిచిపోవడంతో ఆ డబ్బంతా వ్యర్థమైంది. జగన్ ప్రభుత్వం గ్రీవెన్స్ సెల్(ప్రజావేదిక)ను కూల్చివేయడంవల్ల రూ.11.51 కోట్ల ప్రజాధనం వృథా అయింది. నీటిసరఫరా పనులకు గాను రూ.20.81 కోట్ల మొత్తాన్ని అంచనా వేసి రూ.6.93 కోట్లే ఖర్చు చేశారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు సభా ప్రాంగణం, స్మారక సభావేదిక, ధ్యానమందిరంతో కూడిన అంబేడ్కర్ స్మృతి వనం నిర్మాణం నిలిచిపోవడంతో రూ.44.61 కోట్లు వృథా అయినట్లు కాగ్ పేర్కొంది.