రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆసక్తికరంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని ఎప్పటికప్పుడు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఏదైనా ఉప ఎన్నిక జరిగితే దాని అభ్యర్థులకు ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మునుగోడు ఉప ఎన్నిక మాత్రం అందుకు భిన్నంగా. దీని ఫలితం ప్రధాన రాజకీయ పార్టీల ఫ్యూచర్ ముడిపడిన విచిత్రమైన పరిస్థితి. దీంతో.. ఈ ఎన్నికను అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఏం చేసి అయినా సరే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.
ఇంతటి సీరియస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు తరచూ చర్చనీయాంశంగా మారుతోంది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్న ఆయన.. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం చేసేందుకు సిద్ధమని ప్రకటించటం తెలిసిందే. మాటకు అయితే స్టేట్ మెంట్ ఇచ్చేశారు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలతో మాత్రం సమావేశం కాలేదు. అయితే.. తాజాగా ఆయన తన సోదరుడు బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ శ్రేణులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబందించిన పరిణామాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
తాజాగా మునుగోడు మండలం ఊకొండి ఎంపీటీసీ సభ్యురాలు పోలగాని విజయలక్ష్మి భర్త సైదులు సంచలన ఆరోపణలు చేశారు. తనకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పదే పదే వాట్సాప్ కాల్ చేసి.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇబ్బంది పెడుతున్నట్లుగా పేర్కొన్నారు. మండలంలోని చాలామంది కాంగ్రెస్ నేతలకు వెంకటరెడ్డి ఇలా ఫోన్లు చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఇలా చేయటం సరికాదని మండిపడుతున్నారు.
రేవంత్ మీద కోపంతోనే ఇలాంటి తీరును ప్రదర్శిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటే ఏ మాత్రం పొసగనట్లుగా వ్యవహరిస్తారని కోమటిరెడ్డి మీద ఆరోపణలు ఉండటం తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆయన వ్యవహర శైలి చర్చనీయాంశంగా మారింది. ప్రచారం చేస్తానని చెబుతూనే.. ప్రచారాన్నిపట్టించుకోకపోవటం.. అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నఆయన.. ఇప్పుడు ఏకంగా పార్టీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారన్న మండిపాటు వ్యక్తమవుతోంది. ఈ సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు.. ఇదేంది రెడ్డీ? అంటూ ప్రశ్నిస్తూ హెచ్చరికలు జారీ చుస్తున్నట్లుగా చెబుతున్నారు.
కాంగ్రెస్ లో ఉంటే ఉండాలి. లేదంటే బీజేపీలోకి వెళ్లిపోవాలి. అంతేకానీ పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిస్తే ఊరుకునేది లేదన్న మాట పలువురు కార్యకర్తల నోటి నుంచి వస్తున్నట్లుగా చెబుతున్నారు. మునుగోడు ఉప పోరు ప్రచారానికి తాను దూరంగా ఉంటానని ఆ మధ్యన కోమటిరెడ్డి ప్రకటించటం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ అధినేత్రి సోనియాకు లేఖలు రాయటం.. ఆ తర్వాత ఢిల్లీ రాయబారం తర్వాత చల్లబడటం తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఆయన తీరును తప్పు పడుతూ కార్యకర్తలు చేస్తున్న వార్నింగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి.. ఇలాంటి వాటిపై కోమటిరెడ్డి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.