ఉత్కంటకు తెర పడింది. ఆనవాయితీకి భిన్నంగా మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత శాఖల కేటాయింపులో ఆలస్యం జరిగింది. గంటల వ్యవధిలో వచ్చే శాఖల కేటాయింపును రెండు రోజుల తర్వాత కానీ ఫైనల్ చేయలేదు. ఈ లోపు సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ తిరిగినట్లుగా కాకుండా.. మంత్రివర్గం మొత్తం రేవంత్ మార్క్ ఉండేలా చేశారు.
మంత్రులకు కేటాయించే శాఖలకు సంబంధించిన కాంగ్రెస్ అధినాయకత్వంతో సుదీర్ఘ చర్చల అనంతరం ఫైనల్ చేసిన జాబితాను ఈ రోజు (శనివారం) ఉదయం ప్రకటించారు. దీని ప్రకారం చూస్తే.. కీలకమైన హోం శాఖతో పాటు.. కేటీఆర్ నిర్వహించిన పురపాలక శాఖను తన వద్దే అట్టి పెట్టుకున్న రేవంత్.. విద్యా.. ఎస్సీ.. ఎస్టీ సంక్షేమంతో పాటు.. మంత్రులకు కేటాయించని శాఖల్ని తన వద్దే ఉంచేసుకున్నారు.
తాజాగా వెల్లడించిన జాబితాను చూస్తే..
భట్టి విక్ర మార్క ఆర్థిక.. ఇంధన
తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం.. చేనేత
జూపల్లి క్రష్ణారావు ఎక్సైజ్.. పర్యాటకం
ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల.. పౌరసరఫరాలు
దామోదర్ రాజనర్సింహా వైద్య ఆరోగ్య శాఖ.. సైన్స్ అండ్ టెక్నాలజీ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బీ.. సినిమాటోగ్రఫీ
దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటీ.. పరిశ్రమలు.. శాసనసభా వ్యవహారాలు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ.. గ్రహనిర్మాణం.. సమాచార శాఖ
పొన్నం ప్రభాకర్ రవాణా.. బీసీ సంక్షేమం
సీతక్క పంచాయితీ రాజ్.. మహిళ.. శిశు సంక్షేమం
కొండా సురేఖ అటవీ.. పర్యావరణ.. దేవాదాయ శాఖ
మంత్రులకు కేటాయించిన శాఖల్ని చూస్తే.. రేవంత్ ముద్ర కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. ఎవరికి ఏమేం అవసరమో దానికి తగ్గట్లుగా కేటాయింపు ఉందని చెప్పాలి. దీనికి తోడు.. వారి సామర్థ్యంతో పాటు.. కొందరికి అవసరమైన గ్లామర్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. అంతేనా.. ఒక కీలకమైన శాఖ ఇచ్చినట్లే ఇచ్చి.. మరో అప్రాధామ్య శాఖను ఇవ్వటం కనిపిస్తుంది. అందరిని మెప్పించినట్లే మెప్పిస్తూనే.. వారికి పెద్దగా నచ్చని శాఖను ఇవ్వటం చూసినప్పుడు బ్యాలెన్సు ఫార్ములాను ఫాలో అయినట్లుగా చెప్పాలి.
మొత్తం 11 మందిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీద కాస్తంత ఎక్కువ బరువు మోపినట్లుగా కనిపిస్తుంది. సీతక్క విషయంలో మాత్రం కాస్తంత నిరాశే ఎదురైందని చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కేటాయించిన ఆర్థిక ఇంధన కావొచ్చు.. తుమ్మలకు కేటాయించిన శాఖతో పాటు ఉత్తమ్ కేటాయింపులోనూ రేవంత్ గడుసుతనం కనిపిస్తుంది.
కోమటిరెడ్డి విషయంలో ఆయనకు అవసరమైన గ్లామర్ ను ఇవ్వటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. జాబితాను చూసినంతనే.. వంటకం బాగుందన్న భావన కలిగేలా ఉందని మాత్రం చెప్పక తప్పదు. కీలకమైన హోంశాఖను తన వద్దే ఉంచుకోవటం మాత్రం ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో ఇంకెవరికైనా ఇస్తారా? ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్ములాను ఫాలో అవుతారా? అందులోనూ తన ముద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారా? అన్నది చూడాలి.