టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన సి.కళ్యాణ్‌కు సినిమాల పరంగా అంత మంచి ట్రాక్ రికార్డు లేకపోయినా.. ఇండస్ట్రీలో పలుకుబడి బాగానే ఉంది. ఆయన చాలా ఏళ్ల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో కీలకంగా ఉంటున్నారు.
కొన్నేళ్ల కిందట ఛాంబర్ అధ్యక్షుడు అయిన కళ్యాణ్.. తన పుట్టిన రోజును పురస్కరించుకుని మీడియాను కలిసిన సందర్భంగా దిల్ రాజు అండ్ కోను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆగస్టులో తెలుగు సినిమాల షూటింగులన్నింటినీ నెల రోజులు ఆపేసి.. పెరిగిపోతున్న బడ్జెట్లు, ఇతర అంశాల మీద దిల్ రాజు నేతృత్వంలోని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వరుసగా నిర్వహించి కొన్ని తీర్మానాలు చేయడం తెలిసిందే. ఐతే ఇలా షూటింగ్‌లు ఆపేయడంపై అప్పట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అశ్వినీదత్ సైతం దీన్ని తప్పుబట్టారు.
కాగా ఇప్పుడు సి.కళ్యాణ్.. ఈ విషయంలో కొంచెం తీవ్ర వ్యాఖ్యలే చేశారు. షూటింగ్‌లు ఆపేసి సమావేశాలు నిర్వహించడం వల్ల ఏ ప్రయోజనం జరగలేదని, అదొక అట్టర్ ఫ్లాప్ షో అని ఆయన కామెంట్ చేశారు. ‘‘షూటింగ్‌లు ఆపి చర్చించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదని.. నాకు కొన్ని రోజులకే అర్థమైంది. అదొక అట్టర్ ఫ్లాప్ షో. అగ్ర హీరోలతో సినిమాలు తీసే పెద్ద నిర్మాతలు.. డబ్బు ఎక్కడ వృథా అవుతోందో ఆ సమావేశాల్లో తెలుసుకున్నారు. కానీ ఆ మీటింగ్స్‌లో తీసుకున్న నిర్ణయాలను ఇప్పటికీ అమలు చేయలేకపోతున్నారు.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనేది తమ గురించి తామే మాట్లాడుకునే సంస్థ. దాన్ని నేను పట్టించుకోను. అంతకుముందు ఏదో పేరుండేది. తర్వాత అది గిల్డ్ అయింది. రేపు ఇంకోటి వస్తుంది. కానీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది ఫిలిం చాంబర్ మాత్రమే’’ అని కళ్యాణ్ తేల్చేశారు. దిల్ రాజు సహా కళ్యాణ్ ఎవరి పేరూ ఎత్తకపోయినా… గిల్డ్‌ను నడిపించేది పెద్ద నిర్మాతలు ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాలి.