ఒకే పార్టీలో ఉండి కూడా తరచూ సదరు నేత మీద అసహనాన్ని ప్రదర్శించే ఉదంతాలుకొన్ని కనిపిస్తూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూస్తే.. ఎంపీ కేశినేని నానికి.. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మధ్య పంచాయితీ కూడా ఇలానే ఉంటుంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. ఫార్మాట్ లో ఎంపీ పదవికి రాజీనామా చేసి.. వైసీపీలో చేరిన ఆయన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ సందర్భంగా స్పందించిన బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వీడి.. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న కేశినేని నాని.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేయటం.. తమ కమ్మ సామాజిక వర్గం వారు సైతం చంద్రబాబును నమ్మొద్దని చెప్పటాన్ని ప్రస్తావించారు. ఇంతకాలం పార్టీలో ఉండి.. ఇప్పుడు పార్టీ మారిన తర్వాత అధినేత మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బుద్దా వెంకన్న రియాక్టు అయ్యారు.
తాను చంద్రబాబు కాళ్లు మొక్కుతానని కేశినేని నాని తనను ఉద్దేశించి అంటాడని.. ఇప్పుడు ఆయనే జగన్ కాళ్లను మొక్కాడు కదా? అంటూ వ్యాఖ్యానించారు. కేశినేని నానికి ఇకపై సినిమా ఉందన్నబుద్దా.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి.. కేశినేని నానికి మధ్య రిలేషన్ ఎప్పటి నుంచో ఉందన్నారు. అతను టీడీపీలో ఉన్న వైసీపీ కోవర్టుగా తీవ్ర ఆరోపణలు చేశారు.
కేశినేని నానిని తమ అధినేత చంద్రబాబు రెండుసార్లు ఎంపీని చేశారని.. క్యారెక్టర్ లెస్ నాని ఏదేదో మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. కేశినేని నానిని తిట్టమని తనకు చంద్రబాబు చెప్పలేదన్న ఆయన.. నిజానికి ఆయన చెప్పబట్టే ఇంతకాలం నానిని తాను తిట్టలేదన్నారు.
‘చంద్రబాబును తిడితే ఊరుకోను. ఈ విషయంలో చంద్రబాబు ఆగమన్నా కూడా ఆగను’ అంటూ వ్యాఖ్యానించిన బుద్దా.. విజయవాడలో టీడీపీకి చెందిన 60 శాతం కేడర్ పోతుందన్న కేశినేని మాటల్లో నిజం లేదన్నారు. అసలు.. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని గెలిస్తే తన బుద్ధా భవన్ ను ఇచ్చేస్తానని.. ఒకవేళ తాను విసిరిన సవాల్ లో తాను గెలిస్తే.. కేశినేని భవన్ ను ఇచ్చేస్తారా? అంటూ సవాలు విసిరారు. మరి.. దీనికి కేశినేని నాని ఎలా రియాక్టు అవుతారో చూడాలి.