ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం కేబినెట్ మంత్రులతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో డిసెంబర్ వరకు దస్త్రాల క్లియరెన్స్ ఆధారంగా రాష్ట్ర మంత్రులకు ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి చంద్రబాబు 6వ స్థానంలో ఉంటే.. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 8వ స్థానంలో, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో నిలిచారు.
అయితే పవన్, లోకేష్ ర్యాంక్స్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ గా ట్వీట్ చేశారు. మంత్రివర్గపు ర్యాంకుల్లో 8,9 స్థానాలను సాధించిన లొకేష్, పవన్‌లకు అభినందనలు అంటూ అంబటి వ్యంగ్యం చేయగా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వెంటనే అంబటిపై కౌంటర్ ఎటాక్ చేశారు.
`అయ్యా అంబటి.. 8,9 స్థానాల్లో వచ్చిన నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు1,2 స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే 11 స్థానాల్లో ఉన్న మీ వైఎస్ జగన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానంలోకి రావడానికి మరింత కృషి చేస్తున్నాడు` అంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇరువురి ట్వీట్స్ వైరల్ గా మారాయి.
కాగా, జగన్ 2.O వ్యాఖ్యలపై కూడా బుద్దా రియాక్ట్ అయ్యారు. `మొన్న 175 అన్నావ్.. ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది.. ఇప్పుడు 2.0 అంటున్నావ్.. ఈసారి నిన్ను రాజకీయాల్లో కూడా ఉండనివ్వరు ప్రజలు.` అంటూ మాజీ ముఖ్యమంత్రిపై బుద్దా వెంకన్న సెటైర్లు పేల్చారు.