వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డిని ఈనెల 25 వరకు అరెస్ట్ చేయవద్దు అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో వైసీపీకి షాక్ తగిలింది. దీంతో, తాను అమాయకుడినని, ఈ కేసులో తనను సీబీఐ ఇరికిస్తోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి వ్యాఖ్యలపై టిడిపి నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పందించారు.
వివేకాను హత్య చేసిన తర్వాత రక్తపు మరకలను తుడిచిన అవినాష్ రెడ్డి గురించి కడప జిల్లా ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. అవినాష్ పై సిబిఐకి కక్ష ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. తప్పు చేశాడు కాబట్టే అవినాష్ రెడ్డి సీబీఐ దోషి అంటోందని తెలిపారు. అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కేసులో సునీతకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కేసుతో టిడిపికి సంబంధం లేదని, తమపై నిందలు మోపి రాజకీయంగా జిల్లాలో తిరగాలని అవినాష్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. అవినాష్ రెడ్డి మంచితనం గురించి తెలియడానికి ఆయన ఏమి పుచ్చలపల్లి సుందరయ్య కాదని ఎద్దేవా చేశారు. కాగా, తన అరెస్ట్ ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో పులివెందులలో తన అనుచరులు, వైసీపీ కార్యకర్తలతో అవినాష్ రెడ్డి సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే తాను అమాయకుడినని, సీబీఐ తనపై కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గా బీటెక్ రవి ఈ వ్యాఖ్యలు చేశారు.