కరోనా మహమ్మారి దెబ్బకు భారత ఆర్థిక రంగం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కరోనా రాకకు ముందే జీడీపీ దారుణంగా పడిపోయిన నేపథ్యంలో….లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక రంగం కోలుకోలేకపోయింది. లాక్ డౌన్ సమయంలో సెన్సెక్స్ రికార్డు స్థాయిలో నష్టాలను చవిచూసింది. కరోనా భయంతో సెన్సెక్స్ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. అయితే, అన్ లాక్, వ్యాక్సినేషన్ మొదలైన తర్వాత ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక కొద్దిగా గాడిలో పడుతోంది.
దీంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొద్ది రోజులుగా లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సెన్సెక్స్ ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 52 వేల మార్కును దాటి మదుపర్లను లాభాల్లో ముంచెత్తింది. ఈ రోజు ఉదయం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 610 పాయింట్లు లాభపడి 52,154కి చేరుకుంది. నిఫ్టీ 151 పాయింట్లు లాభపడి 15,315 వద్ద స్థిర పడింది.
బ్యాంకెక్స్ సూచీ 3.25 శాతం, ఫైనాన్స్ 2.66 శాతం, రియాల్టీ 1.53 శాతం పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ (6.22%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.12%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.02%), బజాజ్ ఫైనాన్స్ (3.51%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.11%)లు బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.79%), టీసీఎస్ (-1.29%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.03%), ఏసియన్ పెయింట్స్ (-0.90%), టెక్ మహీంద్రా (-0.78%)లు టాప్ లూజర్స్ గా నిలిచాయి.