మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు….. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ప్రజా కవి గోరేటి వెంకన్న పాడిన పాట అక్షర సత్యం అని ఎన్నో ఘటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా నూతన సంవత్సర వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వం మంట కలిసి పోయిందనిపించేలా జరిగిన ఒక ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఓ యువతి నడుపుతున్న స్కూటీని ఢీ కొట్టిన కారు ఆ తర్వాత ఆమెను 12 కిలోమీటర్ల దూరంపాటు ఈడ్చుకు వెళ్లిన వైనం దుమారం రేపుతోంది.
తీవ్ర గాయాల పాలైనన ఆ యువతి కొత్త సంవత్సరం వేళ తనువు చాలించిన వైనం కంటతడి పెట్టిస్తోంది. ఆ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నూతన సంవత్సరం సందర్భంగా ఓ ఫంక్షన్ కు హాజరైన బాధిత యువతి స్కూటీపై ఇంటికి వెళుతోంది. ఆమె స్కూటీని ఎదురుగా దూసుకు వచ్చిన కారు ఒకటి ఢీ కొట్టింది. ఊటుగా మద్యం సేవించిన ఐదుగురు యువకులు ఆ కారులో ఉన్నారు. ఆమెను ఢీకొట్టిన తర్వాత ఆమె శరీరాన్ని అలాగే 12 కిలోమీటర్ల దూరం వరకు ఈడ్చుకు వెళ్లారు.
దీంతో, ఆ యువతి శరీరంపై ఉన్న బట్టలన్నీ చినిగిపోయాయి. ఆ యువతి శరీరం చివరకు ఓ ప్రాంతంలో కారు నుంచి విడిపోయింది. ఆ యువతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో ఆ యువతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయింది. ఈ ప్రమాదానికి కారణమైన ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఈ ప్రమాదం వెనుక లైంగిక వేధింపుల కోణం కూడా ఉందని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన సిగ్గుతో తలవంచుకోవాల్సిన దారుణమని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సెనా అన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.