హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్న రీతిలో కొద్ది రోజులుగా మాటల యుద్దం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి నేతలతో కొట్లాడామని…వారితో పోలిస్తే రేవంత్ రెడ్డి ఓ చిట్టినాయుడు అని కేటీఆర్ విమర్శించారు.
“చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు… నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగ (ఎంతోమంది) వచ్చారు… మస్తుగ పోయారు. పెద్దపెద్దవాళ్లతో కొట్లాడాం. చంద్రబాబుతో కొట్లాడాం… రాజశేఖర రెడ్డతో కొట్లాడాం… కిరణ్ కుమార్ రెడ్డితో, రోశయ్యతో కొట్లాడాం… ఇలా ఎంతోమందితో తలపడ్డాం. వాళ్లందరికంటే కూడా నువ్వు (రేవంత్ రెడ్డి) చాలా చిన్నోడివి. నువ్వు చిట్టినాయుడివి. చాలా చిన్నవాడివి. మా భాషలో… హైదరాబాద్ భాషలో చెప్పాలంటే నీలాంటి వాడిని బుల్లబ్బాయ్ అంటాం… నీలాంటి బుల్లబ్బాయిలు… చిట్టినాయుడిని చాలా చూశాం. ఏం ఫరక్ పడేది లేదు.
వెంట్రుక కూడా పీకలేవు కానీ, నాలుగ రోజులు ఏదో పైశాచిక ఆనందం. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాను… నేనేదో పెద్దవాడిని అయ్యానని ఎగిరెగిరి పడుతున్నావ్.. కానీ రేవంత్ రెడ్డి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నీ దుష్ట సంప్రదాయం నువ్వు పదవిలో నుంచి దిగిపోయాక నిన్ను వెంటాడుతుందని హెచ్చరిస్తున్నాను” అని రేవంత్ పై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
టైగర్ కౌశిక్ భాయ్ అంటూ కౌశిక్ రెడ్డిని కేటీఆర్ ఆలింగనం చేసుకున్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న కౌశిక్ రెడ్డి మామ కృష్ణారెడ్డిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరామని, ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరచాలని కోరుతున్నామని అన్నారు. పార్టీ మారిన అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తే దాడి చేయడమేంటని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి కుటుంబానికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో శాంతిభద్రతలను అదుపు చేయలేకపోతున్నారని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.