తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బుల మూటలు చేరవేసి.. ముఖ్యమంత్రి పదవిని కాపాడు కుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు పీసీసీ పీఠాన్ని కూడా.. 50 కోట్ల రూపాయలకు కొన్నారని సాక్షాత్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చార ని అన్నారు. ఒకవైపు.. కాంగ్రెస్‌పార్టీని, మరోవైపు మోడీ ని కూడా రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి మాటలు చెప్పే సీఎం కాదన్న కేటీఆర్.. ఆయన `మూటలు` మోసే ముఖ్యమంత్రి అని వ్యా ఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని.. తెలంగాణ బిడ్డలు కడుతున్న పన్నుల సొమ్మును కాంగ్రెస్ పార్టీ కోసం ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి కేంద్రంలో ఇద్దరు బాస్‌లు ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒకరు రాహుల్ గాంధీ అయితే.. మరొకరు మోడీ అని.. ఇద్దరినీ రేవంత్ రెడ్డి సంతృప్తి పరుస్తున్నారని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి అక్రమాలను.. అన్యాయాలను మోడీనే కాచుకుంటున్నారని.. ఆయన అండతోనే రేవంత్ రెడ్డి రెచ్చిపోతున్నారని కేటీఆర్ తెలిపారు. కేంద్రం చెప్పినట్టు ఆడుతూ.. తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ దెబ్బతీస్తున్నారని.. ఈ మాట తాను చెప్పడం లేదని.. కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నారని అన్నారు. ఈడీ కేసు ఉన్న నాయకులు ముఖ్య మంత్రి సీటులో కూర్చోవచ్చా? ఆయనపై చార్జిషీట్ కూడా దాఖలైంది కదా? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో పీఎం మోడీపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నికలకు ముందు రాష్ట్రంలో `ఆర్ ఆర్ ఆర్ ` పన్నుల బాదుడు కొనసాగుతోందన్న మోడీ.. దీనిపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. మోడీ రాజకీయ జిత్తుల మారి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తాజాగా తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే పాదయాత్ర ప్రారంభించనున్నట్టు మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పారు.