2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని నిలుపుకోవడంలో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికార పార్టీ వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఎన్నికల హడావిడి మొత్తం ముగిసిన తర్వాత వైసీపీ పరాజయంపై ఎవరికి తోచిన విశ్లేషణ వారు ఇస్తున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్ ఓటమిపై రియాక్ట్ అయ్యారు.
హరీష్ రావుతో పాటు గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలోనే ఉంటున్న కేటీఆర్.. మంగళవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదలకు ఎన్నో మంచి పథకాలు అందించినా వైఎస్ జగన్ ఏపీలో ఓడిపోవడం తమను ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉన్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా నమ్మలేకపోయానని కేటీఆర్ తెలిపారు.
అయితే ఓటమి పాలైనా 40 శాతం ఓట్లు వైసీపీ సాధించడం మాములు విషయం కాదని.. ఒకవేళ పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని కేటీఆర్ కామెంట్స్ చేశారు. జగన్ ను తొక్కడానికి షర్మిలను ఓ పావుగా వాడుకున్నారని.. అంతకు మించి ఏమీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇకపోతే తెలంగాణలో ఓటమిపై కామెంట్ చేస్తూ ప్రజలది తప్పు అనడం తమదే తప్పని, ప్రజలతో మాకు గ్యాప్ రావడం వల్లే ఎన్నికల్లో పరాజయం ఎదురైందని కేటీఆర్ విశ్లేషించారు.