తాజా పార్లమెంటు ఎన్నికల వేళ ఘోరంగా ఓడిపోతుందని.. ఒక్క సీటు కూడా.. దక్కించుకునే పరిస్థితి లేదని అనేక సర్వేలు చాటి చెప్పిన వేళ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఉప పోరు ఒకింత ఊపిరులూదింది. తాజాగా జరిగిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. బీఆర్ ఎస్ తరఫున నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేయగా.. ఆయన 111 ఓట్ల మెజారిటీ తెచ్చుకున్నారు.
ఇదేసమయంలో సీఎం రేవంత్ సహా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో ఆశలు పెట్టుకున్న ఈ స్థానంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓడిపోయారు. బీఆర్ ఎస్ తరఫున బరిలో ఉన్న నవీన్‌కుమార్ రెడ్డికి 763, జీవన్ రెడ్డికి 652 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 1437 ఓట్లు రాగా… వీటిలో 27 ఓట్లు చెల్లలేదని అధికారులు తెలిపారు. దీంతో బీఆర్ ఎస్‌కు.. విజయం దక్కింది.
వాస్తవానికి ఇది. కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం. గతంలో కాంగ్రెస్ నాయకుడు కశిరెడ్డి నారాయణరెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున కల్వకుర్తి నియజకవర్గం నుంచి పోటీ చేశారు. బీఆర్ ఎస్ నాయకుడు అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ను ఓడించారు. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ ఎస్ నాయకుడు నవీన్ విజయం దక్కించుకున్నారు.
కాగా.. బీఆర్ ఎస్ ఇప్పుడు క్లిష్టకాలంలో ఉన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఓడిపోయి.. ఇటు పార్లమెం టు స్థానాల్లోనూ పెద్దగా ప్రభావం చూపదని వస్తున్న వార్తల నేపథ్యంలో అనూహ్యంగా ఎమ్మెల్సీ స్థానం రావడం.. ఆ పార్టీలో కొత్త జోష్ నింపిందనే చెప్పారు.జూన్ 4న వెల్లడి కానున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు సంబందించి వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్ ఎస్‌కు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని.. అన్ని సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే.