పార్టీవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చితీరాల్సిందే అన్నట్లుగా కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత తెలంగాణా నేతల్లో జోష్ బాగా పెరిగిపోయింది. అందుకనే ఇతర పార్టీల్లోనుండి గట్టినేతలను ఆకర్షిస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎంఎల్సీ దామోధరరెడ్డి లాంటి అనేకమంది కాంగ్రెస్ లో చేరిపోయారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారో తెలీదు.
ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ నుండి ఇంకా కొంతమంది నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశముందని కేసీయార్ గ్రహించారు. అందుకనే దానికి రివర్సుగా కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఒక మంత్రితో ఫోన్ చేయించారట. బీఆర్ఎస్ లో చేరితే రేపు అధికారంలోకి రాగానే ఎంఎల్సీ పదవులు కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పనిలోపనిగా సొంతపార్టీ నేతలను కూడా బుజ్జగిస్తున్నారట. కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్ళిపోతారనే అనుమానం ఉన్న నేతలను గుర్తించి పార్టీలోనే ఉండేట్లుగా బుజ్జగింపులు కూడా మొదలైనాయట. కాంట్రక్టులని, పదవులని ఆశలు చూపిస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. మొత్తానికి రెండురకాలుగా కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లు అర్ధమవుతోంది. మొదటిదేమో కాంగ్రెస్ పార్టీని బలహీనంచేయటంలో భాగంగా ఆ పార్టీ నేతలను ఆకర్షించటం. రెండో టెన్షన్ ఏమిటంటే సొంతపార్టీ నేతలను పార్టీనుండి వెళ్ళిపోకుండా చూసుకోవటం.
కాంగ్రెస్ ఊపుచూస్తుంటే వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే కేసీయార్ తరపున మంత్రులు లేదో మరొకళ్ళో ఫోన్లు చేస్తున్నా ఎవరు పెద్దగా సానుకూలంగా స్పందించటంలేదట. ఈమధ్యనే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేయాలని అనుకున్న ఒక కీలక నేతకు కూడా ఒక మంత్రి గాలమేశారట. అయితే సదరు నేత మంత్రి ఆఫర్ను మొహమాటంలేకుండా తిరస్కరించారట. ఇలా ఎందుకు తిరస్కరిస్తున్నారంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం పెరిగిపోతుండటమే అనిపిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.