బీఆర్ ఎస్ నాయకురాలు.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసమే తాను తపిస్తున్నట్టు చెప్పుకొన్నారు. పదేళ్లుగా తాను ఇదే అంతర్మథనం చెందుతున్నట్టు చెప్పారు. పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటారని చెప్పారు. అంతేకాదు.. యువతకు పెద్ద ఎత్తున పదవులు రావాలన్నది తన ఆకాంక్షగా పేర్కొన్నారు. అందుకోసమే తాను.. తపిస్తున్నానని.. తాను ఏం చేసినా. బీఆర్ ఎస్ కోసమేనని ఉద్ఘాటించారు.
తాజాగా మంచిర్యాలలో పర్యటించిన ఆమె.. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి.. తెలం గాణ సమాజం బాగుండాలని కోరుకున్నట్టు తెలిపారు. అనంతరం.. కార్యకర్తలను ఉద్దేశించి కవిత మాట్లా డారు. పార్టీలో తనను తృతీయ పక్షంగా చూస్తున్నారన్న ఆవేదన ఉందన్నారు. అందుకే.. ఇటీవల కేసీ ఆర్‌కు లేఖ రాసినట్టు చెప్పారు. అయితే.. అంతర్గతంగా ఏ విషయాలు అయితే.. చర్చించానో.. వాటిని కొందరు బహిర్గతం చేయడం.. బాధగా ఉందన్నారు.
అసలు కోవర్టులు ఎవరో అందరికీ తెలుసునని చెప్పారు. ఆ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసనని వ్యా ఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని పార్టీ మరిచిపోయిందని కొందరు వ్యాఖ్యానించి నప్పుడు తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు. ఆ బాధ తనకే పరిమితం అయిందన్న ఆమె.. మిగిలిన వారు పదవులు తీసుకుంటున్నారు.. పార్టీకి ఏమేరకు పనిచేస్తున్నారో ఆత్మ విమర్శలు చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
తనను దోషిగానో.. కోవర్టుగానో.. చిత్రీకరిస్తున్న వారు.. తెలంగాణ సమాజానికి ఏం చేశారో చెప్పాలన్నారు. తనకు తెలంగాణ జాగృతి ఉందని.. దీనిని కేసీఆర్ సూచనలతోనే ప్రారంభించామని చెప్పారు. మహిళా సమాజానికి ఉన్న కష్టాలే కాకుండా.. తెలంగాణ సమాజానికి ఉన్న కష్టాలను కూడా జాగృతి పరిష్కరించే ప్రయత్నం చేస్తుందన్నారు. తమ నాయకుడు కేసీఆర్ మాత్రమేనని.. ఆయనను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని మరోసారి ఉద్ఘాటించారు. తన పర్యటనలు కొనసాగుతాయని.. ప్రజల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు.