బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత దాదాపు తన పంతం నెగ్గించుకునేందుకు రెడీ అవుతున్నారు. పార్టీలో తనకు సముచిత గౌరవం కోసం ఎదురు చూస్తున్నారు. తనతండ్రి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను దేవుడు అంటూ.. ఆయన లెగసీని పోగొట్టుకోకుండా వ్యవహరిస్తూనే.. మరోవైపు ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయని వ్యాఖ్యానించారు. అంటే.. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆమె సంపూర్ణంగా వ్యతిరేకి స్తున్నారు. కానీ, కేసీఆర్ వైపు నుంచి కవిత ఆశిస్తున్న `సముచిత స్థానం` దక్కడం ప్రశ్నార్థకంగానే ఉంది.
ఈ నేపథ్యంలో కవిత బయటకు రావడం.. సొంతగా పార్టీ పెట్టడం ఖాయమనే చర్చ సాగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే.. కవితను సమర్ధించేవారు ఎవరు? అనేది ప్రశ్న. పైన చెప్పుకొన్నట్టుగా కేసీఆర్ లెగసీని దాదాపు తనవైపు తిప్పుకొనే ప్రయత్నం అయితే చేయొచ్చు. అంతేకాదు.. కేసీఆర్ తనయగా తన మార్కు రాజకీయాన్ని మరింత ముందుకుతీసుకువెళ్లే ప్రయత్నం చేయొచ్చు. అదేసమయంలో కేసీఆర్ మినహా .. కవిత చెబుతున్న `దెయ్యాలను`.. వ్యతిరేకించే పార్టీ వర్గాలను ఆమె అక్కున చేర్చుకునే అవకాశం ఉంటుంది.
ఇక, ఉద్యమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పడం ద్వారా.. ఉద్యమ నాయకులకు ఆమె ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి.. తర్వాత తెరమరుగైన వారిని తన వైపు తిప్పుకొనే ప్రయత్నం కూడా కవిత సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఇదొక్కటే కాకుండా.. `సామాజిక తెలంగాణ` అంశాన్ని కవిత ప్రస్తావించి.. సామాజిక వర్గాలను కూడా తన వెనుక నడిచేలా చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
భౌతికంగా తెలంగాణ వచ్చినా.. సామాజికంగా తెలంగాణలోని అనేక వర్గాలు వెనుకబడి ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి కూడా చెబుతున్నారు. ఇప్పుడు సామాజిక తెలంగాణ నినాదాన్ని సీఎం సహా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ నినాదాన్ని తాను అందిపుచ్చుకుని సామాజిక తెలంగాణ కోసం.. పార్టీ పెడుతున్నానన్న ప్రచారం చేసుకునే అవకాశం చిక్కుతుంది. ఇక, మహిళా సెంటిమెంటుతో .. మహిళలను కూడా తన వెనుక వచ్చేలా చేసుకోవచ్చు.
ఇక, తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ప్రజలకు చేరువైన కవిత… అటు వైపు నుంచి రాజకీయాలను బలో పేతం చేసుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే.. ఆమె అనుకున్నంత ఈజీగా కానీ.. స్పీడుగా కానీ.. తెలంగాణ సమాజం.. కేసీఆర్‌ను అక్కున చేర్చుకున్నట్టు కవిత ను చేర్చు కుంటుందా? అనేది ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూడాలి.