నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. తనకు మించిన తెలివైనోడు లేడన్నట్లుగా బిహేవ్ చేయటం.. కామెడీ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే రాజకీయ నేత మల్లారెడ్డి.. మరోసారి తన అతిని ప్రదర్శించారు. తన వయసును.. తన రాజకీయ హోదాను పక్కన పెట్టేసి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి. ఆయన తాజా వ్యాఖ్యలు విన్నోళ్లు చెవులు మూసుకునే పరిస్థితి.
మాజీ మంత్రిగా.. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన.. అసెంబ్లీని ఎగ్గొట్టి మరీ సినిమా ఈవెంట్ లో పాల్గొనటం ఒక ఎత్తు అయితే.. సినిమా హీరోయిన్ కసికసిగా ఉందంటూ నోరు పారేసుకున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. చట్టసభల్లో గౌరవప్రదమైన స్థానంలో ఉండే వారు ఇలా మాట్లాడొచ్చా? అన్నది ప్రశ్నగా మారింది.
తాజాగా జరిగిన ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కు అతిధిగా వెళ్లారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఆయన్ను స్టేజ్ మీదకు ఆహ్వానించి మాట్లాడమన్న ఆలస్యం.. తన ఇష్టానుసారం వ్యవహరించారు. హీరోయిన్ ప్రస్తావన వచ్చినంతనే.. ‘‘హీరోయిన్ పేరు కసీ కపూర్ అంట. కసికసిగా ఉంది. ఈ సినిమా హీరో మా విద్యార్థి. మా స్టూడెంట్ హీరో కావటం సంతోషంగా ఉంది. ఇతను ఇక్కడే చదివాడు.
ఇక్కడే హీరో అయ్యాడు. ఇక్కడే సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. హీరో తండ్రి ఎవరో కాదు. మా కాలేజీ ప్రిన్సిపల్. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను రమ్మని పిలిచారు. నాకు కుదర్లేదు. ఈ రోజు అసెంబ్లీ వదిలిపెట్టి మరీ ఆయన కోసం వచ్చా’ అంటూ వ్యాఖ్యానించారు.
హీరోయిన్ పై తప్పుడు వ్యాఖ్యలు చేయటమే కాదు.. అసెంబ్లీ ఎగ్గొట్టి మరీ సినిమా ప్రోగ్రాంకు వచ్చానన్న మల్లారెడ్డి మాటలపై విమర్శలు రేగుతున్నాయి. ప్రజాసమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి.. వాటి సాధన కోసం పోరాడాల్సిన ఎమ్మెల్యే.. అసెంబ్లీకి డుమ్మా కొట్టి సినిమా ప్రోగ్రాంలకు హాజరు కావటం ఒక ఎత్తు. హీరోయిన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు.