పాలమ్మినా..పూలమ్మినా..కష్టపడ్డా…అంటూ తెలంగాణ విలక్షణ రాజకీయవేత్త, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన డైలాగ్ తో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మొహమాటం లేకుండా మాట్లాడడం…కొన్నిసార్లు ఆ క్రమంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం మల్లారెడ్డికి పరిపాటి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరోసారి ఓ బహిరంగ వేదికపై నోరు జారారు. ఆ హీరోయిన్ కసి కసిగా ఉందంటూ మల్లారెడ్డి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా మల్లారెడ్డి చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. “ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మాయి పేరు కసికాపూర్ అట. మంచి కసి కసిగా ఉంది” అంటూ మల్లారెడ్డి కాకా చేసిన కామెంట్లు నెట్టింట కాక రేపుతున్నాయి. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సభకు హాజరైన వారంతా పగలబడి నవ్వారు.
ఈ సినిమాలో హీరో శ్రీహర్ష తమ కాలేజీ విద్యార్థి అని, హీరోగా మారి, ఇక్కడే సినిమా ప్రమోషన్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. తమిళ నటుడు విజయ్ కంటే శ్రీహర్ష అందంగా ఉన్నాడంటూ మల్లారెడ్డి తన స్టైల్లో చేసిన కామెంట్లు నవ్వులు పూయించాయి. శ్రీ హర్ష తండ్రి తమ కాలేజీకి ప్రిన్సిపల్‌గా ఉన్నారని, సినిమాను ఆయన నిర్మించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ ఈవెంట్ కోసం అసెంబ్లీ సమావేశాలు వదిలేసి వచ్చానని అన్నారు.