ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారంపై.. తాజాగా జరిగిన వాదనలు బీఆర్ ఎస్ నేతలను డిఫెన్స్‌లో పడేశాయి. ఇప్పటి వరకు ఎదురు దాడిచేసిన నాయకులు అనూహ్యంగా సైలెంట్ అయిపోయారు.
దీంతో అసలు ఏం జరుగుతోంది? ఏం జరగనుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సిట్ కు కాదు.. సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర సర్కారు స్వాగతించడం లేదు.
ఈ నేపథ్యంలో తన వాదనలను హైకోర్టుకు వివరించింది. అయితే.. ఇదే సమయంలో బీఆర్ ఎస్‌కు షాకిస్తూ .. హైకోర్టులో కొన్ని వాదనలు సాగాయి.
దీంతో బీఆర్ ఎస్ నాయకులు చాలా వరకు ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. ఎందుకంటే.. తీగలాగితే.. అన్నచందంగా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ లోగుట్టు అంతా కూడా.. బాహ్య ప్రపంచానికి తెలిసిపోయింది.
ఇతర పార్టీల తరఫున గెలిచిన 37 మంది ఎమ్మెల్యేలను ఇప్పటి వరకు బీఆర్ ఎస్లోచేర్చుకున్న వైనం కోర్టు ముఖంగా మరోసారి చర్చకు వచ్చింది.
బీఆర్ఎస్ పార్టీ 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 24 మంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుందని.. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 13 మంది ఇతర పార్టీ ఎమ్మెల్యే లను చేర్చుకుందని ప్రతివాదులు కోర్టు కు వివరించారు.
ఫిరాయింపులను ప్రోత్సహించి ఇంత మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న వారు ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఎలా మాట్లాడతారని నిలదీశారు.
నిజానికి ఇది బీఆర్ ఎస్‌కు ఇప్పుడు పెద్ద మాయని మచ్చగా మారింది. మానిందిలే అని అనుకున్న గాయాన్ని తట్టి లేపినట్టు అయింది.
ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని కూడా ప్రతివాదులు కోర్టుకు తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసును సీబీఐకి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం, సిట్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసిన నేపథ్యంలో ఈ వాదనలు తెరమీదికి వచ్చాయి.
ఈ పరిణామాలతో ఈ కేసు సంగతి ఏమో కానీ.. కేసీఆర్ రాజకీయ వ్యవహార శైలి.. నిష్పాక్షికత.. మరోసారి చర్చకువ చ్చాయి. అది కూడా జాతీయ స్థాయిలో ఆయన విజృంభించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ చర్చ తెరమీదికి రావడం మైనస్ అవుతుందని అంటున్నారు పరిశీలకులు.