ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారంలోకి రాకముందు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై, వారి కుటుంబ పాలనపై ఘాటు విమర్శలు చేసేవారు. తెలంగాణ తల్లి ఒక కుటుంబం చేతిలో బందీ అయిందంటూ తీవ్రంగా విమర్శలు చేసేవారు. ఒకరకంగా.. రేవంత్ రెడ్డి పెద్ద నాయకుడిగా ఎదగడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి రావటానికి ఈ తరహా ఆరోపణలు, విమర్శలు కూడా ఒక కారణమనే వారు ఉన్నారు. దీంతో తాను ముఖ్యమంత్రి అయ్యాక అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు స్వయంగా ప్రకటించారు.
తనకు రాజకీయంగా ఇబ్బంది రాకుండా ఉండేందుకుగాను తన సోదరులను రాజకీయాల్లో వేలు పెట్టకుండా చూసుకుంటానని ప్రకటించారు. ఈ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలోనే తన సోదరులతో సమావేశమై.. పాలనలో వారెక్కడా జోక్యం చేసుకోకుండా ఉండటంతో పాటు.. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మొదటినుంచీ తన సోదరులు తన వెంట ఉన్నప్పటికీ వారెప్పుడూ తెర వెనుకే ఉండే వారే తప్పించి.. బయటకు రాలేదని అన్నారు.
ఆయన చెప్పినట్టుగానే కొంతకాలం పాటు అంతా సజావుగానే సాగింది. కానీ, ఇప్పుడు భిన్నమైన పరిస్థితి తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డికి ఆరుగురు సోదరులు ఉన్నారు. వీరిలో ఇద్దరు సోదరులు ఎప్పుడూ రేవంత్ వెనుక ఉంటూ..ఆయనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంటారు. వారిలో తిరుపతి రెడ్డి.. రేవంత్ కు అన్నయ్య కాగా, కొండల్ రెడ్డి.. రేవంత్ కు తమ్ముడు అవుతాడు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రెండు స్థానాల్లో పోటీ చేయగా.. చెరొక చోట వీరు ఇన్చార్జులుగా వ్యవహరించి.. సోదరుడి తరఫున పనిచేశారు.
తిరుపతి రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికను చూసుకోగా, కొండల్ రెడ్డి.. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారాన్ని పర్యవేక్షించారు. అంతవరకూ బాగానే ఉన్నా.. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక వారిద్దరి వైఖరిలో మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పలువురు.. రేవంత్ సోదరులు దందాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికితోడు తిరుపతి రెడ్డి.. కొడంగల్ లో తన సోదరుడి తరఫున వివిధ పథకాలకు సంబంధించిన చెక్కులపే పంపిణీ చేశారు. నియోజకవర్గంలో అనధికారికంగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా తిరుపతిరెడ్డి పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫొటోతో కూడిన భారీ ఫ్లెక్సీలను హైదరాబాద్ లాంటి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ హోదాలో తిరుపతిరెడ్డిని ఈ తరహాలో ప్రమోట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
పైగా, తిరుపతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రముఖ దినపత్రికలో ఫుల్ పేజీ యాడ్ ఇవ్వటం అందులో.. ‘‘మాట తప్పని మహనీయుడు, శత్రువులెరుగని నాయకుడు.. అలుపెరుగని ప్రజా సేవకుడు ఎనుముల తిరుపతిరెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఫుల్ పేజీ యాడ్ ఇచ్చేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్.. సోమాజిగూడ.. అమీర్ పేట.. ఎస్ఆర్ నగర్ … మాదాపూర్ తో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం కలకలం రేపుతోంది. చాలా పోస్టర్లు.. ఫ్లెక్సీల్లో సీఎం రేవంత్ ఫోటో లేకుండా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ తరహా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కుటుంబ పాలన కబంధ హస్తాల్లో తెలంగాణ చిక్కుకుందంటూ గళం విప్పిన రేవంత్.. తాను సీఎం అయ్యాక ప్రజాపాలన మొదలైనట్లుగా చెప్పుకున్నారని, మరి .. ఇప్పుడు సోదరుల సంగతేంటి? అన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను సీఎం కాక ముందు కుటుంబ పాలన అంటూ కేసీఆర్ కుటుంబంపై దుమ్మెత్తి పోసిన రేవంత్.. ఇప్పుడు తన సోదరుల్ని కట్టడి చేయకపోతే.. సోదరుల స్ట్రోక్ ఖాయమన్న మాట వినిపిస్తోంది.