ప్రతి ఇంట్లో నడిచే ఆస్తుల పంచాయితీ తమ ఇంట్లోనూ నడుస్తుందంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించటం.. తన సోదరి షర్మిలతో తనకున్న విభేదాలపై కీలక వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అదే సమయంలో చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే షర్మిల చదువుతున్నారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. ఇంతకాలం ఈ ఎపిసోడ్ లోకి రాని బ్రదర్ అనిల్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఒక టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో షర్మిలపై చేస్తున్న ఆరోపణలపై సరికొత్త లాజిక్ ను తెర మీదకు తీసుకొచ్చారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదివితే షర్మిలకు ఏం లాభం? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆస్తుల్లో వాటాల పంపిణీకి ఈడీ కేసులు.. జఫ్తులు కారణమనే వాదనలోనూ పస లేదన్న బ్రదర్ అనిల్.. ‘ఈడీ జఫ్తులో ఉన్న సాక్షిని ఉపయోగించుకోవటం లేదా?’’ అని ప్రశ్నించారు.
షర్మిలకు న్యాయంగా రావాల్సిన వాటాను ఎందుకు ఇవ్వటం లేదన్న ఆయన.. ‘‘ఆస్తుల పంపకం విషయంలో ఎటూ చెప్పలేక విజయలక్ష్మి నలిగిపోతున్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం షర్మిలకు ఏముంది? దాని వల్ల వచ్చే లాభమేంటి?’’ అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. అప్పట్లో పాదయాత్ర చేయాలని షర్మిలను భారతి అడిగారని.. ఆ కారణంగానే అన్న కోసం షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు.
తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు అందులోకి ఎవరూ రాకుండా జగన్ కట్టడి చేశారన్న అనిల్.. తెలంగాణలో షర్మిలను పార్టీ పెట్టాలని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ చెప్పారన్నారు. ఇదే విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావిస్తూ.. ‘‘అక్కడ కేసీఆర్ ఉన్నారు. ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి. అక్కడ పార్టీ పెట్టొద్దు’’ అని షర్మిలతో జగన్ అన్నట్లు చెప్పారు.
2019 ఎన్నికల్లో గెలిచే జగన్ ఒకలా ఉన్నారని.. గెలిచిన తర్వాత మరోలా మారిపోయినట్లు చెప్పిన అనిల్.. ‘‘సీఎం అయ్యాక మమ్మల్ని జగన్ పక్కన పడేశారు. బీజేపీతోదోస్తీ నేపథ్యంలో నన్ను క్రైస్తవ ప్రచారం చేయొద్దని జగన్ చెప్పారు’’ అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.