బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 (96) తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్వీన్ ఎలిజబెత్-2 స్కాట్లాండ్లోని బాల్మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతూ మరణించారు. క్వీన్ మరణ వార్తను ప్యాలెస్ వర్గాలు ధృవీకరించాయి. క్వీన్ ఎలిజబెత్-2 భౌతిక కాయాన్ని బ్రిటన్ ప్యాలెస్ లో ప్రజల సందర్శనార్థం ఉంచబోతునున్నారని తెలుస్తోంది.
క్వీన్ ఎలిజబెత్-2 మృతి పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కాలపు గొప్ప నాయకురాలు ఎలిజబెత్ అని మోదీ కొనియాడారు. బ్రిటన్ కు సమర్థమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని ఆమె అందించారని ప్రశంసించారు. క్వీన్ ఎలిజబెత్-2 మరణం పట్ల పలువురు దేశాధినేతలు, ప్రధాన మంత్రులు, రాజకీయ వేత్తలు సంతాపం ప్రకటిస్తున్నారు.
70 ఏళ్ల పాటు బ్రిటన్ ను ఏలిన రాణిగా క్వీన్ ఎలిజబెత్-2 గుర్తింపు పొందారు. 1922లో జన్మించిన ఆమె ప్రిన్స్ పిలిప్ మౌంట్ బాటెన్ను 1947లో పెళ్లి చేసుకున్నారు. 22 ఏళ్ల వయస్సులోనే బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలో అత్యధిక కాలం…ఏడు దశాబ్దాలపాటు రాణిగా కొనసాగారు. రాణిగా 70 ఏళ్లపాటు సేవలందించినందుకు గు గత జూన్ లో దేశవ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు.
క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్ (73) బ్రిటన్‌కు కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. కింగ్ చార్లెస్-3గా వ్యవహరించనున్నారు. అధికారికంగా ఆయన పట్టాభిషేకం, లాంఛనాలకు కొన్ని నెలల సమయం పడుతుంది.వేల్స్ కు గతంలో యువరాజుగా వ్యవహరించారు.ఇకపై ఆయన 14 కామన్వెల్త్ దేశాలకు రాజుగా కూడా ఉంటారు. చార్లెస్ 1948 నవంబరు 14న బకింగ్‌హామ్ ప్యాలెస్ లో జన్మించారు. ఎలిజబెత్-2 నలుగురు పిల్లల్లో ఆయనే పెద్దవారు.