సాధారణంగా పెళ్లిళ్లు, రిసెప్షన్ వేడుకలు, సంగీత్, బ్యాండ్ బాజా బరాత్ లలో వరుడు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ స్టేజీపై, రోడ్లపై స్టెప్పులేస్తుంటారు. ఎఫ్2 సినిమాలో చివరిసారిగా నవ్వుతూ తాళికట్టు నాయనా…అంటూ వెంకీకి పంతులుగారు చెప్పినట్లు..మనసారా నవ్వుతూ ఫుల్ జోష్ లో చివరి సారిగా డ్యాన్స్ చేసే చాన్స్ ఇదేననో, లేదంటే…బ్యాచ్ లర్ లైఫ్ కు ది ఎండ్ పడుతోందనే విషాదంలోనో మొత్తానికి మాంచి జోష్ లో చాలామంది పెళ్లికొడుకులు చిందేస్తుంటారు.
అయితే, పుట్టినింటిని మిస్ కాబోతున్నామన్న బెంగతోనో, మెట్టినిల్లు ఎలా ఉండబోతోందన్న టెన్షన్ తోనే చాలామంది వధువులు ముభావంగా ఉంటారు. అయితే, ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది. వరుడికి పోటీగా వధువులు కూడా వెరైటీగా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఓ వధువు ఏకంగా బుల్లెట్ నడుపుకుంటూ పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ పెళ్లి బారాత్ లో వధువు నడి రోడ్డు మీద ‘బుల్లెట్ బండి’ పాటకు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.
మనువాడబోయే వాడిపై తనకున్న ఇష్టాన్ని తెలియజేస్తూ ‘బుల్లెట్ బండి…’ అనే పాటను గాయని మోహన భోగరాజు పాడారు. పుట్టింట్లో తాను ఎలా పెరిగిందో.. తన మనస్తత్వం ఏంటో.. మెట్టినింట్లో ఎలా మెలుగుతానో తెలియజేసే ‘బుల్లెట్ బండి’ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లాలోని ఓ పెళ్లి బారాత్ లో కారు దిగిన వధువు రోడ్డుపైనే ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది.
కాబోయే భార్య ఈ రేంజ్ లో డ్యాన్స్ చేస్తుందని ఊహించని వరుడు షాకయ్యాడు. చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్నేహితులు వధువును ఎంకరేజ్ చేయడంతో….వరుడు కూడా వధువు స్టెప్పులకు అనుగుణంగా రెండు స్టెప్పులేశాడు. ఏమాత్రం జంకు లేకుండా ఆ నవ వధువు ఇరగదీసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో, ఈ వీడియోను మధ్యప్రదేశ్ లో మార్క్ ఫెడ్ ఎండీగా పనిచేస్తున్న రామగుండానికి చెందిన ఐఏఎస్ అధికారి పి.నరహరి ట్వీట్ చేశారు. గాయని మోహనకు ట్యాగ్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.
This bride has truly danced for the groom. She is so happy welcoming him into her life. #truelove Wants to ride on his #Bulletbandi Lovely lyrics and song by @MohanaBhogaraju pic.twitter.com/lV4kdGPplm
— P Narahari IAS (@pnarahari) August 17, 2021