ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. వాస్తవానికి ఈ పరీక్ష వాయిదా వేస్తారని.. పెద్ద ఎత్తున శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం జరిగింది. ఇక, ఇటు ప్రభుత్వం పరంగా కూడా దీనిపై క్లారిటీ లేకపోవడంతో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తీవ్ర గందరగోళ పరిస్థితిని ఎదుర్కొన్నారు. వాస్తవానికి రోస్టర్ విధానంపై ఏపీపీఎస్సీ అభ్యర్థులు హైదరాబాద్ సహా ఏపీలో ఆందోళన వ్యక్తం చేశారు. రోస్టర్ విధానం తప్పుల తడకగా ఉందని.. దీంతో ఉద్యోగాలు వచ్చినా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. మరో వైపు.. ప్రభుత్వం నుంచి కూడా పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి అభ్యర్థన వచ్చింది. అయినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సహా.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ శనివారం రాత్రి పొద్దు పోయాక ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది. దీంతో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు 175 కేంద్రాల్లో ఆదివారం ప్రారంభమయ్యాయి.
అన్ని ఉమ్మడి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపికైన 92వేల, 250 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ నోటిఫికేషన్లో 905 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇదిలావుంటే.. గ్రూప్- 2 పరీక్షల్లో ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
తాళి కట్టు శుభవేళ..
తిరుపతికి చెందిన నమిత అనే అభ్యర్థి గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యారు. అయితే.. పరీక్ష వాయిదా పడుతుందన్న సంకేతాల నేపథ్యంలో కుటుంబంలోని పెద్దలు.. ఆమెకు ఆదివారం తెల్లవారుజామున పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున వివాహమైంది. అయితే.. పరీక్ష వాయిదా పడకపోవడంతో ఆమె పెళ్లి మండపం నుంచి తలపై జీలకర్ర బెల్లం, పెళ్లి దుస్తులతోనే గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యారు. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో కేటాయించిన పరీక్షా హాల్‌కు అలానే వచ్చారు. ఆమె పట్టుదల, కృషి విజయం సాధించాలని.. నెటిజన్లు అభిలషిస్తూ.. పోస్టులు పెడుతున్నారు.