గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో సునాయాస గెలుపు ఖాయమని అనుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఊహించని రీతిలో సీట్లు దక్కాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు సైతం షాక్ తింటున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగులుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ అలాంటి పోటీనే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
ఎన్నికల ఫలితాలు ఓ వైపు వెలువడుతున్న తరుణంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమాచారం ఇచ్చారు. గంటలో కీలక ప్రకటన చేస్తా అని ఆయన పేర్కొన్నారు. ఫలితాలు తీవ్రంగా నిరాశ పరిచాయన్న పీసీసీ చీఫ్ ఈ మేరకు ఉత్కంఠను పెంచారు. కొద్దిసేపటి అనంతరం టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్ ఫలితాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
గత కొద్దికాలంగా తెలంగాణ కాంగ్రెస్లో ఇంటి పంచాయతీ తెరమీదకు వచ్చింది. ఏకంగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదుల వరకూ…సీన్ చేరిపోయింది. ప్రధానంగా ఇదంతా పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్గా జరిగింది. తాజాగా జీహెచ్ఎంసీ ఫలితాలకు ముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పలువురు కాంగ్రెస్ నేతల ప్రత్యేక సమావేశం జరగడం, అనంతరం ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో ఉత్తమ్ రాజీనామా చేశారు.