కరోనా విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పాలకులు కొందరు అందుకు భిన్నంగా వ్యవహరించటం కనిపిస్తుంది. ఎవరు అవునన్నా.. కాదన్నా.. అమెరికాలో ఈ రోజున కరోనా ఈ స్థాయిలో విరుచుకుపడటానికి కారణం ట్రంప్ పుణ్యమేనని చెప్పక తప్పదు. కరోనా విషయంలో ఉదాసీనంగా వ్యవహరించటం.. ఆర్థిక అంశాలే తప్పించి మిగిలిన అంశాల్ని పెద్దగా పట్టించుకోని తీరుకు అమెరికా భారీమూల్యం చెల్లించుకుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ట్రంప్ తీరు ఇలా ఉంటే.. మరికొందరు దేశాధ్యక్షుల తీరు మరింత దారుణంగా ఉంటుంది.
ఆ కోవలోకే వస్తారు బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సానారో. మొదట్నించి కరోనా విషయంలో ఆయన అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరుతో ఆ దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికి తన తీరు మార్చుకోని ఆయన.. తాజాగా మరోసారి నోరు పారేసుకున్నారు. కరోనాకు చెక్ పెట్టే ఫైజర్ వ్యాక్సిన్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాక్సిన్ వాడే వారికి కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కు కంపెనీ బాధ్యత వహించదన్న విషయాన్ని హైలెట్ చేస్తూ.. ఆయన బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి.
రికార్డు సమయంలో రూపొందించిన ఫైజర్ వ్యాక్సిన్.. నూటికి నూరు శాతం పని చేస్తుందన్న మాటను కంపెనీ కూడా చెప్పింది లేదు. కాకుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకు చెక్ పెట్టేందుకు ఈ వ్యాక్సిన్ కీలకమన్నది మర్చిపోకూడదు. కానీ.. ఆ విషయాన్ని వదిలేసి.. కంపెనీ ప్రస్తావించిన మాటను పట్టుకొని.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బ్రెజిల్ లో భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తెర తీస్తూనే.. ఫైజర్ ఇచ్చిన కాంట్రాక్టులో.. సదరు కంపెనీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కు బాధ్యత వహించదని ఉందన్నారు.
అందువల్ల టీకా తీసుకున్న తర్వాత ఎవరైనా మొసలిగా మారితే అది వారి సమస్యగా తేల్చేస్తున్నారు. అంతేకాదు.. టీకా తీసుకున్న వారు సూపర్ హ్యుమన్ లుగా మారినా.. మహిళలకు గడ్డాలు వచ్చినా.. మగాళ్ల గొంతులు మారినా ఫైజర్ పట్టించుకోదని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళాన్ని రేకెత్తించటమే కాదు.. స్థైర్యాన్ని దెబ్బ తీస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి దేశాధ్యక్షులు ఉన్న దేశంలో కరోనా క్షేమంగా పెరిగి పెద్దది కావటమే కాదు.. ఎప్పటికి వణికిస్తూనే ఉంటుందని చెప్పక తప్పదు.