తన కొడుకు గౌతమ్‌ను హీరోగా నిలబెట్టాలని ఎంతో ఆశపడ్డాడు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం. కానీ గౌతమ్ ఇప్పటిదాకా చేసిన ఏ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. తొలి చిత్రం ‘పల్లకిలో పెళ్లికూతురు’కు రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకుడు అన్నీ తానై వ్యవహరించినా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత బసంతి, మను లాంటి విభిన్న ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు.
దీంతో కెరీర్ ముందుకు సాగలేదు. ఐతే చాలా గ్యాప్ తర్వాత అతను మళ్లీ హీరోగా నటించబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ఆ సినిమాలో బ్రహ్మానందం కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. ఆ సినిమా పేరు.. బ్రహ్మ ఆనందం కావడం విశేషం. ఆర్వీఎస్ నిఖిల్ అనే కొత్త దర్శకుడు రూపొందించబోయే ఈ చిత్రాన్ని ఈ రోజే అనౌన్స్ చేశారు.
మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద లాంటి చిత్రాలతో అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాహుల్ యాదవ్ నక్క ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్‌తో పాటు ‘హుషారు’ ఫేమ్ ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హొలక్కల్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఒక ప్లెజెంట్ కాన్సెప్ట్ పోస్టర్‌తో సినిమాను అనౌన్స్ చేసింది టీం. ఆ పోస్టర్ చూస్తే ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
రాహుల్ యాదవ్ ఇప్పటిదాకా ప్రతి సినిమాకూ కొత్త దర్శకుడితోనే పని చేస్తూ వచ్చాడు. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ నిర్మాతగా తన అభిరుచిని చాటాడు. మరి అతడి సక్సెస్ స్ట్రీక్ ఈ సినిమాతోనూ కొనసాగి బ్రహ్మానందం కొడుక్కి ఓ మంచి సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.