టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు సృష్టించాలనున్న వైసీపీ నేతలు…చంద్రబాబు గెస్ట్ హౌస్ కు పవర్ కట్ చేయించారని ఆరోపణలున్నాయి. పవర్ కట్ కాలేదని, జనరేటర్ ఏర్పాటు కూడా చేశామని విద్యుత్ అధికారులు వివరణనివ్వడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభను సైతం అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఓ వైసీపీ కార్యకర్త కర్రలు, రాళ్లతో చంద్రబాబువైపునకు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు చితకబాది..పోలీసులకు అప్పగించారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తే బాంబు వేస్తానని వైసీపీ నేత సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అతగు బాంబు తెచ్చాడని టీడీపీ కార్యకర్తలు అనుమానించారు. సీఎం జగన్ డౌన్ డౌన్, వైసీపీ గూండాలు డౌన్ డౌన్ అంటూ వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సభకు భారీగా జనం రావడం ఓర్చుకోలేని వైసీపీ నేతలు…ఎలాగైనా అడ్డంకులు సృష్టించి సభ నుంచి జనాన్ని బయటకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు …కొద్ది సేపు మాట్లాడడం ఆపేశారు. అంతకముందు, టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చింపివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దానికి ప్రతీకారంగా వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు చించివేశాయి. దీంతో, టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పర్యటనకు జగన్ అడ్డంకోవాలనుకుంటున్నారని, అందుకే అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
జగన్ పై పట్టాభి బూతు వ్యాఖ్యల చేశారన్ని ఆరోపణలపై చంద్రబాబు స్పందించారు. రెండేళ్లుగా తమపై వైసీపీ నేతలు ఎన్నోసార్లు బూతులు మాట్లాడారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు తిడితే మేం పడాలా? అని ప్రశ్నించారు. కానీ టీడీపీ నేతలు తిడితే మాత్రం ఆఫీసులపై దాడి చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. రెండు పార్టీలవారు మాట్లాడిన మాటలను ప్రజల ముందు పెడతామని, ఒకవేళ తాము తప్పు చేసి ఉంటే ప్రజలకు క్షమాపణ చెబుతానని చంద్రబాబు అన్నారు.ఈ విషయం గురించి మాట్లాడేందుకు తాను ఎక్కడికైనా వస్తానని అన్నారు. తన మంచితనాన్నే చూశారని, బాంబులకు తాను భయపడేవాడిని కాదని అన్నారు.