చైనాలో సోమవారం మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 133 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోయింగ్ 737 విమానం గ్వాంగ్జూ రీజియన్లోని వుజుహ్ నగరం సమీపంలో ఉన్న మారుమూల పర్వత ప్రాంతంలోని టెంగ్ కౌంటీ వద్ద కుప్పకూలింది. ఈ పెను ప్రమాదంలో విమానంలోని మొత్తం 133 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తోంది. అయితే, ఎంతమంది మరణించారన్నదానిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
కన్మింగ్ నుంచి గ్వాంగ్జాంగ్ ప్రాంతానికి వెళ్తున్న విమానం హఠాత్తుగా కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే సహాయక, రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే, విమానం ఓ కొండపై కూలిపోగా ఆ తీవ్రతకు మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఆ మంటల ధాటికి సమీపంలోని అడవిలో కార్చిచ్చు రేగిందని, దీంతో, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తీరు, విమానం కూలిపోయిన తర్వాత జరిగిన అగ్నిప్రమాదం దృష్ట్యా విమానంలోని వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువేనని సహాయక సిబ్బంది భావిస్తున్నారు.
సోమవారం మధ్యాహ్నం 1గంట తర్వాతఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. కున్మింగ్ సిటీ నుంచి మధ్యాహ్నం 1.00 గంటకు బయలుదేరిన విమానం.. గమ్యస్థానం గ్వాంగ్జూకి నిర్దేశిత సమయానికి చేరుకోలేదు. దీంతో, విమానం ప్రమాదానికి గురైందని నిర్ధారించారు. ఆ సమయంలోనే విమానం కూలిన విషయాన్ని స్థానికులు చెప్పడంతో సహాయక చర్యలు మొదలుబెట్టారు. విమానంలోని ప్రయాణికులు బతికే అవకాశముందా లేదా అన్నదానిపై స్పందించేందుకు చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ నిరాకరించింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.