నోటి మాటతో హామీ ఇవ్వటం పెద్ద విషయం కాదు. కానీ.. ఆ హామీని అమలు అయ్యేలా చేయటం ఎంత కష్టమన్న విషయం తాజాగా జరుగుతున్న పరిణామాల్ని చూస్తే.. ఇట్టే అర్థం కావటమే కాదు.. రానున్న రోజుల్లో తెలంగాణ బీజేపీకి కొత్త తిప్పలు షురూ కానుందని చెప్పక తప్పదు. ఒకప్పుడు ఆయుధంగా మారిన పసుపు.. ఇప్పుడు అదే వారి పాలిట శాపంగా మారుతుందంటున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి 178 మంది పసుపు రైతులు ఎన్నికల బరిలోకి దిగటం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని.. పసుపు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కలిగేలా చేయాలన్న డిమాండ్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఓటమి పాలయ్యేలా చేసింది. తాము అధికారంలోకి వచ్చినంతనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన బీజేపీనేతల మాటలను నమ్మటం.. పసుపు రైతులు మొత్తం మద్దతు ఇవ్వటంతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎంపీగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఎంపీగా గెలిచి ఏడాదిన్నర అవుతున్నా.. ఇప్పటివరకు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవటంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో.. వారు కొత్త ఉద్యమానికి తెర తీశారు. బీజేపీ ఎంపీ అరవింద్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వేళ.. ఆయన చౌట్ పల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో సమావేశాన్నినిర్వహించారు. దీనికి ఎన్నికల బరిలో నిలిచిన 178 మంది రైతుల్ని పిలిపించారు.
కాకుంటే.. సమావేశ మందిరంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించకుండా ఉండటం.. మరెవరిని రాకుండా పరిమితులు విదించి మీటింగ్ చేపట్టారు. అయితే.. రైతులు అడిగిన పసుపు బోర్డు.. మద్దతు ధరకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వకపోవటం.. అసలు విషయాలు తప్ప సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తున్న ఎంపీని రైతులు అడ్డుకున్నారు. దీంతో.. ఎంపీకి.. రైతులకు మధ్య వాదన మొదలైంది. చివరకు కోపంతో సమావేశం మధ్య నుంచి అర్వింద్ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.
తమ సమావేశం విఫలమైనట్లుగా రైతులు పేర్కొన్నారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డు కోసం చేసిన ప్రయత్నాల్ని వివరించినా.. రైతులు మాత్రం సంత్రప్తి చెందలేదు. తాము పసుపు బోర్డు ఏర్పాటు.. మద్దతు ధర ప్రకటన అంశాల్నే ఎజెండాగా చేర్చుకొని చర్చలకు వచ్చామని..వాటిపై స్పష్టత ఇవ్వకుండా ఏవేవో మాటలు మాట్లాడితే ఎలా అని మండిపడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పసుపు అంశమైతే ఆయుధంగా ఉందో.. ఇప్పుడు అదే అంశం తెలంగాణ బీజేపీ నేతలకు చుక్కలు చూపిస్తుందన్న మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ అంశంపై తెలంగాణ బీజేపీ నేతలు ఇరుకున పడటం ఖాయమంటున్నారు.