చినికి చినికి గాలివానలా మారనుందా ఢిల్లీ లిక్కర్ స్కాం అన్నదిప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఈ కేసులో ఇప్పటివరకు వినిపించిన దాని కంటే ఎక్కువ తీవ్రతే ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఈ స్కాం బయటకు వచ్చిన నాటి నుంచి.. సీఎం కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత పేరు వినిపించటం.. దాన్ని ఆమెతో పాటు టీఆర్ఎస్ వర్గాలు ఖండించటం లాంటివి జరుగుతున్నాయి.
పనిలో పనిగా.. తన తండ్రి కమ్ సీఎం కేసీఆర్ తరచూ అనే ఈడీ.. బోడీ అనే మాటల్ని కవిత కూడా అనటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ రోజు (శుక్రవారం) ఉదయం కవిత పీఏ నివాసంలోనూ.. ఆమె అకౌంటెంట్ గా వ్యవహరించే వ్యక్తి నివాసంలోనూ ఈడీ సోదాల్ని నిర్వహించింది.
అంతేకాదు.. ఇప్పటివరకు లేనిది.. తాజాగా చోటు చేసుకున్న మరో పరిణామం కవితకు ఈడీ నోటీసులు పంపించటం.
ప్రస్తుతం కరోనా సోకిన కవిత క్వారంటైన్ లో ఉండటంతో ఆమె సహాయకులకు ఈడీ నోటీసుల్ని అందించింది.
దాదాపు రెండు వారాల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత హస్తం ఉందన్న వాదనను ఢిల్లీ బీజేపీ నేతలు వ్యాఖ్యానించటం.. దానిపై కవితతో సహా టీఆర్ఎస్ నేతలు పలువురు తీవ్రంగా తప్పు పట్టటం తెలిసిందే.
అనంతరం కొంత కాలం ఏమీ జరగనట్లుగా ఉన్నప్పటికీ.. ఈ రోజు (శుక్రవారం) మాత్రం దేశ వ్యాప్తంగా మొత్తం 40 ప్రాంతాలకు పైనే ఈడీ దాడులు నిర్వహిస్తోంది.
హైదరాబాద్ విషయానికి వస్తే..పలువురు వ్యాపారవేత్తలతోపాటు.. కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
అదే సమయంలో దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీసాయి క్రిష్ణ రెసిడెన్సీలో కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో సోదాల్ని నిర్వహించారు. బుచ్చిబాబు గతంలో కవిత వద్ద అకౌంటెంట్ గా ఉండేవారు.
అంతేకాదు గచ్చిబౌలిలో అభినవ్ రెడ్డి నివాసంలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
గతంలో కవితకు పీఏగా పని చేసిన అభిషేక్ రావు ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తుండటం ఇప్పుడు సంచలంగా మారింది. వీరే కాక.. అభిషేక్.. ప్రేమ్ సాగర్ రావు.. అరుణ్ పిళ్లై ఇళ్లల్లోనూ సోదాల్ని నిర్వహిస్తున్నారు.
ఇదంతా చూస్తే.. తాజా ఎపిసోడ్ లో టార్గెటెడ్ గానే ఈడీ సోదాల్ని నిర్వహిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క హైదరాబాద్ లోనే మొత్తం 25 టీంలతో ఈడీ తనిఖీలు చేపట్టటం గమనార్హం.