బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. మీడియా ముందుకు వచ్చి.. బీఆర్ ఎస్‌ను బీజేపీలో విలీనం చేయనున్నారని.. గతంలోనూ ఈ ప్రయత్నం చేశారని.. కానీ.. అప్పట్లో తానే అడ్డుపడ్డానని ఆమె చెప్పుకొ చ్చారు. అవసరమైతే.. ఎన్నేళ్లయినా.. జైల్లో ఉంటానని కానీ.. బీఆర్ ఎస్‌ను మాత్రం బీజేపీలో విలీనం చేయొద్దని వేడుకున్నానని తాజాగా చెప్పారు. ఆమె ఈవ్యాఖ్యలు చేసి ఇంకా గంట కూడా కాకముందే.. బీజేపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“కవిత చెప్పిన మాటలతో నేను కూడా ఏకీభవిస్తున్నా. `భారీ` ప్యాకేజీ(సీఎం సీటు కావొచ్చు) ఇచ్చుంటే.. అప్పట్లో .. బీజేపీనే బీఆర్ ఎస్‌లో విలీనం అయి ఉండేది“ అని రాజా వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఓ లేఖ విడుదల చేశారు. దీనిలో కీలక వ్యాఖ్యలు చేశారు. “మావాళ్లను తక్కువగా అంచనా వేయలేం. పెద్ద ప్యాకేజీ కనుక మాకు దక్కి ఉంటే.. మా పార్టీ ఎప్పుడో బీఆర్ ఎస్‌లో కలిసిపోయి ఉండేది. కానీ.. అదే జరగలేదు. అందుకే చేరలేదు“ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఒకవేళ బీఆర్ ఎస్‌లో కనుక బీజేపీ చేరిపోయి ఉంటే.. తామంతా చేతులు కట్టుకుని ఉండే పరిస్థితి వచ్చేదన్నారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న విషయాన్ని బీఆర్ ఎస్ నిర్ణయించేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో మిలాఖత్ రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయని.. అందుకే పార్టీ నష్టపోతోందని రాజా వ్యాఖ్యానించారు. “నిజానికి మా పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంది. కానీ, ఎందుకు రాలేదు? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ఒక్కసారి ఆలోచన చేయండి.“ అని రాజా సింగ్ కామెంట్ చేశారు.