గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో బీజేపీ తప్పు చేసిందనే అంటున్నారు మెజారిటీ నేతలు. గోషామహల్ నియోజకవర్గం ఎంఎల్ఏ రాజాసింగ్ రాజీనామా అంశం ఇపుడు పార్టీలో సంచలనంగా మారింది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేసింది. అయితే గెలిచింది మాత్రం ఒకే ఒక నియోజకవర్గంలో . అది కూడా ఓల్డ్ సిటీలోని గోషామహల్ నియోజకవర్గంలో.
ఏ విషయంలో అయినా మొదటి నుండి రాజాసింగ్ ఓల్డ్ సిటిలో ఎంఐఎం పార్టీ నేతలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎంఐఎం ప్రబల్యాన్ని తట్టుకుని ఓల్డ్ సిటిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ తో కార్యక్రమాలు నిర్వహించటమంటే మామూలు విషయం కాదు.
అంతటి కీలక, సున్నితమైన ప్రాంతంలో పార్టీకి రాజాసింగ్ వెన్నుముక గా నిలిచారు. రాజాసింగ్ కు పార్టీ తరపున అనేక మంది నేతలు మద్దుతుగా నిలబడటం వల్లే ముందస్తు ఎన్నికల్లో రాజాసింగ్ గెలిచారు. అలాంటిది తాజా ఎన్నికల్లో రాజాసింగ్ సిఫారసు చేసిన అభ్యర్ధుల్లో పార్టీ ఒక్కరికి కూడా టికెట్లు ఇవ్వలేదు. పార్టీ పటిష్టతకు, తన గెలుపుకు కష్టపడిన నేతలకు టికెట్లివ్వాలంటూ ఎంఎల్ఏ చేసిన సిఫారసును పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏమాత్రం విలువ ఇవ్వలేదు.
గోషామమల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే డివిజన్లలో ఎంఎల్ఏ సిఫారసుకే ప్రాధాన్యత ఉంటుందని అందరు అనుకున్నారు. అందుకనే రాజాసింగ్ సిఫారసు చేసిన నేతలు తమకే టిక్కెట్లు ఖాయమని ప్రచారం కూడా మొదలుపెట్టేసుకున్నారు. తీరా టికెట్ల పంపిణిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా బీఫాం దక్కకపోవటంతో ఎంఎల్ఏ షాక్ తిన్నారు. బండి సంజయ్ తనిష్ట ప్రకారమే అభ్యర్ధులను ఎంపిక చేసి బీఫారంలను జారీ చేసేశారు. దాంతో రాజాసింగ్ కు మండిపోయింది. అందుకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. అధిష్టానంతోనే తేల్చుకుంటామని అన్నారు కానీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే.
టిక్కెట్లిచ్చేసి, బీఫాంలు జారీ చేసి నామినేషన్లు వేసేసిన తర్వాత ఎంఎల్ఏ ఎవరితో మాట్లాడితే మాత్రం ఏమిటి ఉపయోగం . పార్టీ అసలు ఇలా ఎందుకు చేసిందో ఎవరకీ అర్ధం కావటం లేదు. మామూలుగా నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో టిక్కెట్లు ఫైనల్ చేసేటపుడు సదరు ఎంఎల్ఏ మాట్లాడకుండా ఏ విషయం ఫనల్ చేయరు. అలాంటిది రాజాసింగ్ సిఫారసులకు బండి ఏమాత్రం విలువ ఇవ్వలేదంటే తెరవెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అదేమిటో తేలితే కానీ సమస్య పరిష్కారం కాదని సీనియర్ నేతలంటున్నారు. ఏదేమైనా గ్రేటర్ ఎన్నికల తర్వాతే ఈ పంచాయితీ మొదలవుతుంది.
గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కించుకున్నవారు గెలిస్తే సమస్యుండదు. అలా కాదని అందరు ఓడిపోతే మాత్రం రాజాసింగ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. పార్టీ మీద మండిపోతున్న ఎంఎల్ఏతో మాట్లాడి సమస్యను సర్దుబాటు చేసేందుకు సీనియర్లు రంగంలోకి దిగారు. మరి రాజాసింగ్ మెత్తపడి ప్రచారం చేస్తారా లేకపోతే పార్టీ ఖర్మానికి పార్టీని వదిలేస్తారా అన్నది చూడాలి. ఏదేమైనా ఓల్డ్ సిటిలో రాజాసింగ్ కున్న పట్టు పార్టీలో అందరికీ తెలిసిందే. మరి తెరవెనుక ఏమి జరిగిందో ఇపుడు తెరముందు ఏమి జరగబోతోందో చూడాల్సిందే.