సీఎం కేసీఆర్ తన రాజకీయ వారసుడు కేటీఆర్ ను త్వరలోనే సీఎం చేయబోతున్నారని తెలంగాణలో జోరుగా జరుగుతున్న ప్రచారానికి గులాబీ బాస్ తెర వేసిన సంగతి తెలిసిందే. మరో పదేళ్లు తానే సీఎం అని…కేటీఆర్ సీఎం అంటూ పార్టీ నేతలు మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానంటూ కేసీఆర్ తనదైన శైలిలో మండిపడ్డారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, సీఎం మార్పు అంటూ ప్రచారం చేయొద్దంటూ తన పార్టీ నేతలకు సారు హుకుం జారీ చేశారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సీఎం ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని, కానీ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే ఆందోళనకరంగా తయారైందని కేసీఆర్ పై రాములమ్మ సెటైర్ వేశారు. టీఆర్ఎస్ నేతల దోపిడీలతో సామాన్య ప్రజల బతుకులు ఆగమైపోయాయని ఆరోపించారు. సీఎం పదవిస్తానని చెప్పి దళిత బిడ్డలను కేసీఆర్ మోసగించారని, అటువంటి కేసీఆర్ తన వారసుడికి సీఎం పదవి ఎలా కట్టబెడతారని ప్రజలు, బీజేపీ నిలదీయడంతో దొర భయపడ్డారని విమర్శించారు.
మరో పదేళ్లు తానే సీఎం అంటూ కేసీఆర్ మరోసారి ప్రజలకు మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విజయశాంతి దుయ్యబట్టారు. మబ్బుల మాటున ఉండే వానాకాలపు సూర్యుడిలా మరో పదేళ్ల పాటు ప్రగతిభవన్ లో, ఫాంహౌస్ లో కేసీఆర్ దర్శనం కోసం జనం, టీఆర్ఎస్ నేతలు ఎదురు చూడాలని ఎద్దేవా చేశారు. మరో పదేళ్లపాటు జనం తననే భరించాలని కేసీఆర్ తన వ్యాఖ్యల ద్వారా చెబుతున్నారేమోనని రాములమ్య చమత్కరించారు. పదేళ్లు అవసరం లేదని, కేసీఆర్ కారు మబ్బుల్ని మరో మూడేళ్లలోనే ప్రజలు చెదరగొడతారని, ఆ రోజులు దగ్గరపడుతున్నాయని రాములమ్య జోస్యం చెప్పారు.