చంద్రబాబు అక్రమ అరెస్టు బీజేపీని జాతీయ స్థాయిలో ఆత్మరక్షణలో పడేసిందా..? ప్రధాని మోదీ-కేంద్ర హోం మంత్రి అండ లేకుండా సీఎం జగన్ ఇంత దుస్సాహసానికి దిగరని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు భావిస్తున్నారా..? ముఖ్యంగా హైదరాబాద్‌లోని సీమాంధ్రులు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారా? కేంద్ర పెద్దల ఆందోళన, హడావుడి చూస్తే అవుననే అనిపిస్తోంది. గత నెల 9వ తేదీన వేకువఝామున స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్టుచేశారు. సీఎంగా పనిచేసిన ఆయనపై కేసు పెట్టాలంటే గవర్నర్ అనుమతి అవసరం.
కానీ ఆయనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా అరెస్టు చేశారు. అంతేకాదు.. కోర్టు ఉత్తర్వులు ఇవ్వకముందే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించేందుకు వాహనాలు సిద్ధం చేయడం.. వరుసగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్ కేసుల్లో ఆయన్ను విచారించడానికి కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేయడం.. బాబు కేసులను విచారిస్తున్న ఆయా కోర్టుల్లో పరిణామాలు.. అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత కూడా వాదనలు వినిపించడం.. హైకోర్టు తీర్పు రిజర్వు చేసిన తర్వాత కూడా ఏవేవో డాక్యుమెంట్లు సమర్పించడం వంటి చర్యలు చూశాక.. వ్యవస్థలను జగన్ సంపూర్తిగా మేనేజ్ చేస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది.
చంద్రబాబు అరెస్టును ఆయన భార్య సోదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, వామపక్ష నేతలు ఖండించారు. జగన్‌ను కీర్తించేసోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వంటివారు నోరు మెదపలేదు. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా కిమ్మనలేదు. చివరకు గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీపైన, చంద్రబాబుపైన దుమ్మెత్తిపోసి.. తెలంగాణ సెంటిమెంటును రగిల్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన టీ(బీ)ఆర్ఎస్ నేతలు కూడా బాబు అరెస్టును ఖండించారు. హైదరాబాద్, బెంగళూరులోని ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా నిరసనలు చేపట్టారు.
తెలంగాణవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వారికి స్థానికంగా మద్దతిచ్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటీపడ్డారు. అయితే హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిరసనకు దిగడం జగన్‌కు రుచించలేదు. అంతే.. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడైన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో ఆయన సన్నిహితులు మాట్లాడినట్లు ఉన్నారు. అంతే.. ఐటీ ఉద్యోగులపై ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారు. ఆంధ్ర రాజకీయాలతో తెలంగాణకు సంబంధం లేదని. . చంద్రబాబు అరెస్టు ఆంధ్రకు సంబంధించిందని.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో నిరసనలు చేపడితే అణచివేస్తామని బహిరంగంగానే ప్రకటించారు.
దీంతో అక్కడ స్థిరపడిన, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న సీమాంధ్రులు కస్సుమన్నారు. సైబరాబాద్ సృష్టికర్త గురించి అంత చులకనగా మాట్లాడతారా అని విరుచుకుపడ్డారు. స్థానిక బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారానికి వచ్చినప్పుడు వారిని నిలదీశారు. మోదీ-షా అండ లేకుండా జగన్ ఇంత సాహసానికి దిగుతారా.. చంద్రబాబును అరెస్టు చేసి బెయిల్ రాకుండా ఇన్ని రోజులు రాజమండ్రి జైల్లో ఉంచారంటే కేంద్రం మద్దతు ఉన్నందునేనని.. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. మోదీ-అమితషాకు సన్నిహితుడని.. ఆయనే చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ సర్కారుకు అనుకూలంగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారని.. ఇక తమను మభ్యపెట్టలేరని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇందుకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఈ ఘటన శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగింది. పాతబస్తీ తప్ప గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గంలో సీమాంధ్రులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ప్రధానంగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సనతనగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అంబర్‌పేట, ఉప్పల్, పటాన్చెరు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల సంఖ్యలో వారు ఉన్నారు. ఉత్తర తెలంగాణలోనూ కోస్తా నుంచి వచ్చి స్థిరపడినవారు ఉన్నారు. అంతే.. తెలంగాణ బీజేపీ నేతలకు తత్వం బోధపడింది. గ్రేటర్ పరిధిలోని సీమాంధ్రులను సంతృప్తిపరచకపోతే వారి ఓట్లు పడడం కష్టమేనని అర్థమైంది.
ఇదే సమయంలో రాష్ట్రానికి వచ్చిన అమితషాను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు కలిశారు. అసలు విషయం చెప్పారు. ఈ పరిస్థితి కాంగ్రెస్‌కే ప్రయోజనకరమన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆంధ్రుల్లోనే ఇంత అనుమానం ఉంటే.. ఇక ఆంధ్రలో ఇంకెలా ఉంటుందోనని షా కూడా భావించారు. ప్రధాని మోదీకి చేరవేయడంతో దీని నుంచి బయటపడే మార్గం చూడాలని ఆయన ఆదేశించారు. ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో మాట్లాడాలని పురమాయించారు. లోకేశ్ పెద్దమ్మ పురందేశ్వరి, కిషన్‌రెడ్డి ఇందుకు చొరవ చూపారు. కిషన్‌రెడ్డి ద్వారా ఫోన్ చేయించి లోకేశ్‌ను తన నివాసానికి పిలిపించుకున్నారు.
చంద్రబాబు అరెస్టు, ఆయనపై పెట్టిన కేసులు, కోర్టులో జరుగుతున్న విచారణ గురించి లోకేశ్ వివరించారు. తనను కూడా వదిలిపెట్టలేదని, తనపై కూడా చాలా కేసులు పెట్టారని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసింది జగన్ ప్రభుత్వమైతే.. బీజేపీపై ఆరోపణలు వస్తున్నాయని.. కొందరు ఏపీ మంత్రులు బీజేపీ మద్దతుతోనే అరెస్టు జరిగిందని.. ఇక ఆయన బయటకు రావడం కల్లేనని ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. దీనిపై అమితషా.. లోకేశ్‌తో మాట్లాడుతూ. ‘మీ నాన్న అరెస్టు వెనుక కేంద్రం పాత్ర ఉందంటూ జగన్ చెబుతున్నది నిజం కాదు. మాకే సంబంధమూ లేదు’ అని వివరణ ఇచ్చారు.
పనిలోపనిగా.. రాజకీయాల్లో అప్పుడప్పుడూ ఇలాంటి క్లిష్ట పరిస్ధితులు వస్తుంటాయి.. ధైర్యంగా ఉండాలని.. తాము అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చారు. ఈ భేటీ జగన్‌కు షాకిచ్చిందని వైసీపీ, బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం బీజేపీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మోదీ-షా నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తారని.. అనాది మిత్రపక్షాలైన శివసేన, అకాలీదళ్నే విచ్ఛిన్నం చేసిన వారు.. టీడీపీని వదిలిపెడతారని భావించడం లేదని.. ఎన్డీఏలో టీడీపీ ఉన్నప్పుడే.. జగన్‌కు వారిద్దరూ అండగా నిలిచారని.. ఆయన అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నా అడుగడుగునా మద్దతిస్తూ వస్తున్నారని.. అలాంటివారు ఇప్పుడు చంద్రబాబుపై తమకు సానుభూతి ఉందని చెబితే ఎవరూ నమ్మరని స్పష్టం చేస్తున్నారు.