మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామి శివసేనలో అసమ్మతి భగ్గుమంది. మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో.. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనం అంచున నిలిచింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వా లు కుప్పకూలాయి.
బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక సహా ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలోనూ బీజేపీ అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఎంత వేగంగా అంటే.. ఎమ్మెల్యేలను ఎవరినీ ముంబై(రాజధాని) నగరం దాటి వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చారు అమిత్ షా. ఆయన ఆదేశాలతో ఎమ్మెల్యేలు ముంబైలోనే ఉండిపోయారు.
రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తోన్న తరుణంలో బీజేపీ కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ముంబై దాటి వెళ్లొద్దని సూచించింది. ఒకవేళ, అఘాడీ కూటమి దిగిపోతే.. శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్ షిండే మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.
మహారాష్ట్రలో సంక్షోభం నేపథ్యంలో తిరుగుబాటు మంత్రి ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఏఎన్ఐకి వెల్లడించారు. ఇందులో 6-7 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, తాము కూడా వారిని సంప్రదించలేదని పేర్కొన్నారు. అయితే.. బీజేపీ నుంచి ప్రతిపాదన వస్తే.. హిందూత్వాన్ని కాపాడుకునేందుకు.. బాల ఠాక్రే ఆత్మకు శాంతి చేకూర్చేందుకు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. దీంతో బీజేపీతో షిండే చేతులు కలపడం ఖాయమనే ఊహాగానాలకు బలం చేకూరింది.
ఏక్నాథ్ షిండే వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. వీరంతా ఒకవేళ బీజేపీలో చేరితే ఉద్దవ్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. మంగళవారం గుజరాత్లో ఓ హోటల్లో ఉన్న ఈ బృందం.. ఇప్పుడు అసోంకు వెళ్లింది. ఈ నేపథ్యంలో షిండే చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
ఠాక్రే హిందుత్వను అనుసరిస్తా అని.. దానిని మరింత ముందుకు తీసుకెళ్తా అని అసోంకు వెళ్లేముందు మీడియాతో చెప్పారు. దీంతో బీజేపీ కూడా షిండేను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.