ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. సింఫుల్ గా ఒక్క మాటలో బీజేపీ హైదరాబాద్ మహానగర ఎన్నికల ప్రణాళిక గురించి చెప్పాలంటే ఇదే. ఇప్పటికే ఊరించే వరాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోకు ఏ మాత్రం తగ్గకుండా ఉండటమే కాదు.. మరిన్ని కొత్త అంశాల్ని చేర్చటం.. టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్న చందంగా కమలనాథుల తీరు ఉన్నట్లుగా చెప్పాలి. తాజాగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలోని చాలా అంశాలు టీఆర్ఎస్ మీద ఒత్తిడిని పెంచేవే అని చెప్పక తప్పదు.
మెట్రో..సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అన్ని హామీల్లోకెల్లా కీలకమైనదిగా చెప్పాలి. ఈ హామీ కానీ ప్రజల్లోకి వెళితే.. దాని ఫలితం మరోలా ఉంటుందంటున్నారు. ఒకవేళ ఎన్నికల్లో బీజేపీ ఓడినా.. టీఆర్ఎస్ కు తిప్పలు తప్పవని చెప్పాలి. ఎందుకంటే.. మేనిఫేస్టోలో ప్రస్తావించిన అంశాల్లో కొన్ని టీఆర్ఎస్ నాయకత్వం అమలు చేయక తప్పనిపరిస్థితిని తీసుకొస్తాయని చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యేకంగా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టో అమలుకు ఎంత ఖర్చు అవుతుందన్న విషయానికి వస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫేస్టోకు రూ.70వేల కోట్ల వరకు అవసరమవుతుందన్న అంచనా వేశారు. తాజాగా బీజేపీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక అమలుకు తక్కువలో తక్కువ రూ.50వేల కోట్లకు పైనే ఖర్చు అవుతుందంటున్నారు. టీఆర్ఎస్ తో పోలిస్తే.. తక్కువ బడ్జెట్ అవసరమైనప్పటికీ.. ఆకర్షణీయంగా తయారు చేయటంలో బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారని చెప్పాలి.
బస్సులు.. మెట్రోరైల్ లో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణం విషయానికే వస్తే.. ఇది చూపించే ప్రభావం ఎక్కువ.. అయ్యే ఖర్చు తక్కువగా చెబుతున్నారు. దీని భారాన్ని వెంటనే ప్రభుత్వం మోయాల్సిన అవసరం ఉండదని చెప్పాలి. అదెలానంటే.. ఉదాహరణకు మెట్రో రైల్లో ప్రయాణించే మహిళలకు ఉచితంగా ప్రయాణించే హామీని అమలు చేస్తే.. ఆ భారం ప్రభుత్వం మీద వెంటనే పడకుండా ఎల్ అండ్ టీతోఒప్పందం చేసుకోవచ్చు. ముందుగా ఇచ్చిన లీజుకు కొన్ని సంవత్సరాలు అదనంగా ఇవ్వటం ద్వారా.. ప్రభుత్వం మీద నేరుగా భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు.
ఇదొక్కటే కాదు.. వరదబాధితులకు రూ.25వేల మొత్తాన్ని చూసినా.. ఇప్పటికే పరిహారం కింద పదివేలు అందిన వారికి రూ.15వేలు ఇస్తామని..అస్సలు అందని వారికి రూ.25వేలు ఇస్తామని చెబుతున్నారు. విన్నంతనే రూ.25 వేల మాట వినిపించినా.. వాస్తవంలో వారు ఇవ్వాల్సింది రూ.15వేలు మాత్రమేనని చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేస్తామన్న మాటనే తీసుకుంటే.. దీనికి అయ్యే ఖర్చు ఏమీ ఉండదు.. వచ్చే ఆదాయం పోతుంది. వాస్తవానికి ఎల్ఆర్ఎస్ పథకాన్ని అమలు చేయటం ద్వారా ఆదాయం వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి. జీహెచ్ఎంసీకి కాదన్నది మర్చిపోకూడదు. కాకుంటే.. ఎల్ఆర్ఎస్ మాటతో ఇప్పటికే భారం పడిన నగర ప్రజలకు బీజేపీ తాజా ప్రకటన ఊరటగా మారుతుంది.
అదే సమయంలో.. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మాదిరి ఎల్ ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయటం ప్రజల్లో వ్యతిరేకత పెంచే వీలుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే.. చాలా తెలివిగా.. ముందు చూపుతో రూపొందించినట్లుగా చెప్పాలి. తాము గెలిస్తే.. హామీల అమలు కాస్త కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. కానీ.. ఓడితే మాత్రం.. బీజేపీ ఇచ్చిన హామీల్లో అన్నోఇన్నో అయితే కేసీఆర్ సర్కారు అమలు చేయాల్సి ఉంటుంది. లేకుంటే.. ప్రజల్లో వ్యతిరేకత ఖాయమని చెప్పక తప్పదు.
నమస్తే ఆంధ్ర TANA వార్తలు కింద చదవండి
‘తానా’’అధ్యక్ష’పోరులో ‘త్రిముఖ’ పోటీ-కాబోయే అధ్యక్షుడెవరు?