సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్నాన్న అయిన వివేకా కేసు మూడేళ్ల పాటు విచారణ కొనసాగడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. వివేకా కూతురు సునీత రెడ్డి ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం సహకారం సరిగ్గా ఉండటం లేదు అన్న రీతిలో ఆరోపణ చేయడం సంచలనం రేపింది.
అంతేకాదు, ఈ కేసును పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణలోని హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా సునీత రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ హత్య కేసులో సీఎం జగన్ బండారం కూడా బయటపడబోతోందని ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు.
సొంత చెల్లెలు వైఎస్ షర్మిల, వివేకా కూతురు సునీతలను ఇబ్బందిపెడుతున్న జగన్ ఏం సాధించారని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ఆడపడుచులకు భద్రత ఎక్కడ ఉందని ఆయన నిలదీశారు. అంతేకాదు, జగన్ కు ఎదురు చెప్పే పరిస్థితి రాష్ట్రంలో లేదని, ఆయనకు ఎదురు చెప్పిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం చెక్ పెడుతుందని ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కింగ్ పిన్ అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ఆదినారాయణ రెడ్డి గుర్తు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆదినారాయణ రెడ్డి చేసిన కామెంట్లు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.