బీజేపీ అగ్రనేతలు డ్యామేజ్ కంట్రోలుకు దిగినట్లే కనిపిస్తోంది. తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను దింపేసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. బండిని ఎందుకు తప్పించినట్లు ? కిషన్ రెడ్డికి ఎందుకిచ్చినట్లో ఎవరికీ తెలీదు. నేతలిద్దరి వర్కింగ్ స్టైల్ చూస్తే బండి ముందు కిషన్ రెడ్డి తేలిపోతారు. మాటల్లో కానీ చేతల్లో కానీ బండి ఫుల్ పవర్ తో ఉంటారు. కిషన్ రిఫైన్డ్ గా మాట్లాడుతారు. కిషన్ మాటల్లో పంచ్ ఉండదు.
పైగా బండేమో తెలంగాణలో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. బీసీల్లో కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో యాదవ, గౌడ్ తర్వాత జనాభా పరంగా మున్నూరుకాపు, ముదిరాజులే ఎక్కువ. ముదిరాజు, మున్నూరుకాపుల ఓట్లు సుమారు 20 శాతం ఉంటాయని అంచనా. ఇంతటి బలమైన సామాజిక వర్గానికి చెందిన బండిని సింపుల్ గా అగ్రనేతలు అలా తీసి పక్కన పెట్టేశారు. దాంతో పార్టీలోని బీసీ నేతల్లోనే అసంతృప్తి మొదలైంది.
పార్టీకి ఇపుడున్న ఊపుకు బండి సంజయే కారణమని చెప్పాలి. 24 గంటలూ కష్టపడి, రాత్రనక, పగలనక రోడ్లపైనే తిరుగుతుండేవారు. అలాగే ప్రతిరోజు ఏదో ఇష్యూతో కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడుతుండే వారు. దాంతో పార్టీలో మంచి ఊపొచ్చింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దెబ్బకు ఆ ఊపంతా పోయింది. స్కామ్ లో ప్రధాన సూత్రధారి కల్వకుంట్ల కవితే అని ఈడీ తేల్చినా ఇంతవరకు అరెస్టు జరగలేదు. దాంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపణలతో రెచ్చిపోయారు.
ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయంతో హస్తం పార్టీలో ఊపొచ్చేసింది. సరిగ్గా ఈ సమయంలోన బండిని అగ్రనేతలు అధ్యక్ష స్థానం నుండి తప్పించారు. అయితే వెంటనే బీసీల్లో వ్యతిరేకత మొదలవ్వటంతో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటలను ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ గా నియమించారు. అంటే బండి, ఈటల విషయంలో జరిగిన డ్యామేజిని కంట్రోల్ చేయటం కోసం అగ్రనేతలు అప్పటికప్పుడు పదవులిచ్చినట్లు అర్ధమైపోతోంది. మరి డ్యామేజీ కంట్రోలు వర్కవుటవుతుందా ?