టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఊరటనిచ్చిన ఏపీ హైకోర్టు….సీఎం జగన్ కు షాకిచ్చింది. తన ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతపై అయ్యన్నపాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు తన ఇంటి గోడను కూల్చివేశారని అయ్యన్న తన పిటిషన్‌లో హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. కూల్చేసిన గోడను తిరిగి నిర్మించుకునేందుకు అనుమతించాలని అభ్యర్థించారు.
దీంతో, అయ్యన్న తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు…ఆయనకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కూల్చేసిన గోడను నిర్మించుకునేందుకు అయ్యన్నకు అనుమతినిచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను వాయిదా వేసింది. అంతకుముందు, అయ్యన్న ఇంటి ప్రహరీ గోడను అర్ధరాత్రి వేళ హఠాత్తుగా కూల్చివేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమ ఇంటి గోడను ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చివేసిందని అయ్యన్న, ఆయన తనయులు ఆరోపించారు.
అంతేకాదు, ప్రభుత్వం, అధికారుల తీరుకు నిరసనగా అయ్యన్న కుమారుడు విజయ్ దీక్షకు కూడా దిగారు. ల్యాండ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే గోడను నిర్మించామని, పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని విజయ్ ఆరోపించారు. గోడను ప్రభుత్వ స్థలంలో నిర్మించినందుకే కూల్చేశామని అధికారులు చెబుతున్నారని ఆరోపించారు. దీక్ష సందర్భంగా పోలీసులు, అయ్యన్న కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగింది.
మరోవైపు, ఆ ఘటనను నిరసిస్తూ టీడీపీ ‘ఛలో నర్సీపట్నం’ కార్యక్రమానికి నిన్న పిలుపునిచ్చింది. దీంతో, చుట్టుపక్కల జిల్లాల నుంచి నర్సీపట్నానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నర్సీపట్నం బయలుదేరగా…వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.