బిగ్ బాస్ రియాల్టీ షో తదుపరి సీజన్ కోసం ఎదురుచూస్తున్న వేళ.. షాకింగ్ కామెంట్లు చేశారు యూట్యూబ్ తొలితరం హాట్ నటిగా గుర్తింపు పొంది.. తెలుగులో బూతుల్ని ఎంత యదేచ్ఛగా వాడేయొచ్చో నటించిన చూపిన నటి సరయు. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడో సీజన్ కు సిద్ధమవుతున్న బిగ్ బాస్ కు సంబంధించిన వివరాల్ని ఒక్కొక్కటిగా విడుదల అవుతున్న వేళ.. అనూహ్యంగా తెర మీదకు వచ్చారు సరయు.
ఇప్పటికి రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ కి ఎంపికైన ఆమె.. తొలిసారి బిగ్ బాస్ హౌస్ లో కేవలం ఒక వారం మాత్రమే ఉండి.. తిరిగి పంపేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేయటంతో పాటు.. అదో వివాదాస్పద నిర్ణయంగా మారింది. అనంతరం బిగ్ బాస్ ఓటీటీలో మరోసారి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అక్కడ కూడా నాలుగు వారాలకు మించి ఉండలేకపోయింది. ఇప్పుడు ఏడో సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న వేళ.. సదరు రియాల్టీ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
రియాల్టీ షో పేరుతో టెలికాస్ట్ అయ్యేవన్నీ ఫేక్ షోలుగా తేల్చేసింది. బిగ్ బాస్ తో పాటు అన్ని రియాల్టీషోలది అదే దారి అన్న సరయు.. ‘వాళ్లే డబ్బులు ఇస్తారు. లేదంటే వాళ్లను కొనుక్కొని వాళ్లకు కావాల్సిన వారిని ప్రమోట్ చేసి గెలిపిస్తారు. దాన్ని రియాల్టీగా ప్రేక్షకులకు చూపించి జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోకు వెళ్లక ముందు వరకు తాను కూడా భ్రమలో ఉండేదానినని.. కానీ వెళ్లి వచ్చిన తర్వాత తనకు చాలా తెలిసిందని పేర్కొనటం గమనార్హం.
దయచేసి ఇలాంటి రియాల్టీ షోలోను చూడొద్దన్న సరయు.. ‘మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను ఇలా చెప్పటానికి కారణం లేకపోలేదు. బిగ్ బాస్ కు వెళ్లాను కాబట్టి ఈ మాటను చెబుతున్నా. అక్కడకు వెళ్లినంత వరకు నేను మీలానే అనుకున్నా. అంతకు ముందు జాబ్ చేశామా? ఇంటికి వచ్చామా? యూట్యూబ్ వీడియోలు చేస్తున్నామా? అదే నా లైఫ్ లో ఉండేది’’ అని చెప్పుకొచ్చారు. కానీ.. హౌజ్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ జరిగింది చూసి తాను షాక్ తిన్నట్లుగా చెప్పింది.
కొంతమందికి బయట నుంచే కాదు లోపల కూడా సపోర్టు ఉండేదని.. వారి కాన్ఫిడెన్సు వేరేలా ఉండేదన్న సరయు.. ‘అలాంటి వారితో పోటీ పడటం చాలా కష్టం. నిజం చెప్పాలంటే వారితో పోటీ పడుతూ.. పోరాటం చేస్తే మనమే నెగిటివ్ అవుతామని నాకు అర్థమైంది. దీంతో నేను చాలా ఒత్తిడికి గురయ్యేదానిని. అందుకే చెబుతున్నా.. ఇదంతా ఫేక్’ అని తేల్చేశారు.
బిగ్ బాస సీజన్ 7 వచ్చేస్తున్న వేళ.. గతంలో ఈ షోలో రెండుసార్లు పాల్గొన్న ఒక సెలబ్రిటీ ఇంత సూటిగా ఫేక్ అని చెప్పేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. సరయు వ్యాఖ్యల నేపథ్యంలో మరికొందరు ఏమైనా తెర మీదకు వస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.