టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా షాక్ కు గురైన సంగతి తెలిసిందే. అయితే, ఆ హఠాత్పరిణామం నుంచి బయటకు వచ్చిన నారా కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు, కార్యకర్తలకు మేమున్నామని ధైర్యాన్నిచ్చారు. గతంలో ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాలలో లేని నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు కూడా చంద్రబాబు కోసం ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టు వార్త విని అశువులు బాసిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో యాత్ర చేపట్టారు.
ఈ యాత్ర సందర్భంగా తొలిసారి ఓ బహిరంగ సభలో నారా భువనేశ్వరి ప్రసంగించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన భువనేశ్వరి…కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మొదటిసారి ఈ తరహా బహిరంగ సభలో మాట్లాడుతున్నానని, ఏవైనా తప్పులు దొర్లి ఉంటే, తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని సభికులను భువనేశ్వరి కోరిన వైనం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, భువనేశ్వరి ప్రసంగం, మాటతీరు, తెలుగు భాషపై పట్టు వంటి విషయాలపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ట్రోలర్స్ కు చెక్ పెట్టేలా భువనేశ్వరి క్షమాపణలు చెప్పారు. నిజం గెలవాలి కార్యక్రమం ఓ పోరాటం అని, అది తన ఒక్కదాని పోరాటం కాదని..మీ ఆందరిది అని భావోద్వేగానికి గురయ్యారు. మన రాష్ట్రం కోసం, మన కోసం, మన బిడ్డల కోసం అంటూ భువనేశ్వరి ఎమోషనల్ గా మాట్లాడారు.
చంద్రబాబు తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. తన బాధను మహిళలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని భువనేశ్వరి చెప్పారు. రాజకీయాలు చేసేందుకు తాను ఇక్కడకు రాలేదని, నిజం గెలవాలి అని చెప్పేందుకే వచ్చానని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలని చంద్రబాబు నిత్యం ఆలోచించేవారని, రాళ్లూరప్పల మధ్య హైటెక్ సిటీ ఏంటని హేళన చేసినా పట్టించుకోకుండా లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపారని అన్నారు.