బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో అఖిల ప్రియకు బెయిల్ మంజూరు కావడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత నుంచి గర్భవతి అయిన అఖిల ప్రియ మీడియాకు దూరంగా ఉంటున్నారు.
అయితే, రెండ్రోజుల క్రితం భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు విఖ్యాత్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. కరోనా టెస్టుల నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు కేసు నమోదైంది. తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఈనెల 3న కోర్టు విచారణకు హాజరుకాలేమని వారు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందించేందుకు చాలాకాలం తర్వాత అఖిల ప్రియ మీడియా ముందుకు వచ్చారు. తాము ఆస్తుల కోసం పోరాడడం లేదని, హక్కుల కోసం పోరాడుతున్నామని అన్నారు. గర్భిణిని కాబట్టే ఇంతకాలం బయటికి రాలేదని, డాక్టర్ సలహా ప్రకారం ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు. భూమా నాగిరెడ్డి ఆస్తులు, అభిమానులు, కార్యకర్తలతో పాటుగా కొందరు శత్రువులను కూడా వారసత్వంగా తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.
దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఉంటే తనను డైరెక్ట్ గా ఎదుర్కోవాలని, తప్పుడు కేసులతో పోలీసులను అడ్డుపెట్టుకొని వేధించాలనుకోవద్దని తన ప్రత్యర్థులకు భూమా అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసు కోర్టులో ఉన్నందున దానిపై స్పందించేందుకు అఖిల ప్రియ నిరాకరించారు. భార్గవ్, విఖ్యాత్ లకు హెల్త్ బాగా లేకుంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారని, టెస్ట్ చేయించుకున్న కొన్ని గంటలకే పోలీసులు ఇంటికి వచ్చారని తెలిపారు.
ల్యాబ్ వాళ్లు మాకు ఒక రిపోర్టు, పోలీసులకు మరో రిపోర్టు ఎందుకిచ్చారో తెలియదన్నారు. ల్యాబ్ వాళ్లను కొట్టి, హింసించారని తమకు సమాచారం ఉందని, తెలంగాణలోని ఒకరిద్దరి అండతో కొందరు పోలీసులు తమపై వరుసగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. తమపై కేసులకు రాజకీయాలకు సంబంధం లేదని, ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్న వైనంపై కేసీఆర్, కేటీఆర్‌కు లేఖ రాస్తానని అన్నారు.