మెగాస్టార్ చిరంజీవికి ‘భోళా శంకర్’ ఒక మరపురాని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ సినిమా మీద ముందు నుంచి అంచనాలు తక్కువే కానీ.. అయినా సరే బాక్సాఫీస్ దగ్గర అంత ఘోరమైన ఫలితాన్ని అందుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. లో బజ్‌తో రిలీజై, బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కనీసం వీకెండ్ వరకు కూడా సత్తా చాటలేకపోయింది. ఫుల్ రన్లో పాతిక కోట్ల షేర్‌కు పరిమితమై చిరు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. వీకెండ్ అవ్వగానే ఈ సినిమా నెగెటివ్ షేర్లోకి వెళ్లిపోయిందంటే.. బ్యాడ్ టాక్ ఎంతగా ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా చిరు సినిమా అంటే టాక్ ఎలా ఉన్నా సరే, సామాన్య ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే.. అభిమానుల నుంచి మంచి ఆదరణే ఉంటుంది.
కానీ ఈసారి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ఓన్ చేసుకోలేదన్న సంగతి స్పష్టంగా తెలిసిపోయింది.
ఈ నేపథ్యంలోనే ‘భోళా శంకర్’ డిజాస్టర్ కావడంలో అభిమానుల పాత్ర కూడా కీలకమని మెగా ఫ్యామిలీ లాంగ్ టైం పీఆర్వో, ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వ్యాఖ్యానించడం గమనార్హం. మంగళవారం చిరు పుట్టిన రోజు వేడుకల్లో అతను.. అభిమానులనుద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘భోళా శంకర్’లో చిరు కెరీర్లోనే అత్యంత స్టైలిష్‌గా కనిపించాడని.. ఇలాంటి సినిమాను అభిమానులు ఓన్ చేసుకోలేదన్నట్లుగా మాట్లాడాడు ఎస్కేఎన్. ‘భోళా శంకర్’ ఫెయిల్యూర్‌కు మెగా ఫ్యాన్స్ కూడా పరోక్షంగా కారణమయ్యారని.. వాళ్లు వేరే వాళ్ల ట్రాప్‌లో పడిపోయి సినిమాను దెబ్బ తీసుకున్నారని ఎస్కేఎన్ వ్యాఖ్యానించాడు.
చిరంజీవి రీమేక్ సినిమా చేయాలా.. స్ట్రెయిట్ సినిమా చేయాలా అన్నది అభిమానులు మాట్లాడకూడదని.. ఎప్పుడు ఏది చేయాలో ఆయన కంటే బాగా ఎవరికీ తెలియదని పేర్కొన్న ఎస్కేఎన్.. సినిమా అంటే ఆయనకు అమ్మకం కాదు, నమ్మకం అంటూ పంచ్ డైలాగ్ కూడా వేశాడు. చిరుతో పాటు పవన్ కళ్యాణ్ తరచుగా రీమేక్ సినిమాలు చేస్తుండటంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. వాళ్ల అసంతృప్తిని బ్రో, భోళా శంకర్ చిత్రాల విషయంలో చూపించారన్నదీ స్పష్టంగా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎస్కేఎన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.