మాస్ కా బాప్, నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘ఆహా‘లో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే’ టాక్ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఏడాది దీపావళి కానుకగా ఆహాలో మొదలైన ఈ షో బాలయ్య అభిమానులు ఆహా…అనేలా చేసింది. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఆహా ఓటీటీకి కొత్త ఊపును ఇచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. తొలి సీజన్ లో టెలికాస్ట్ అయిన ప్రతి ఎపిసోడ్ కు అనూహ్య స్పందన వచ్చింది.
బాలయ్య తనదైన డైలాగులతో హావభావాలతో..స్టెప్పులతో ఈ షోను మరో లెవల్ కు తీసుకువెళ్లారు. హీరో బాలయ్య హోస్ట్ ఏంటి అని పెదవి విరిచిన వారంతా… ఈ షో చూశాక బాలయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ముక్కున వేలేసుకున్నారు. ఇలా, బాలయ్య బాబులోని మరో కోణాన్ని చూపించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో రెండో సీజన్ లోనూ అదరగొడుతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరో టాక్ షోకు ఆహా అధినేత అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంతో మరో షో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఓ కొత్త కాన్సెప్ట్ రూపొందించిన ఆహా టీం అందులో బ్రహ్మీ హోస్ట్ అయితే బాగుంటుందని ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలోనే బ్రహ్మానందంతో అల్లా అరవింద్ ఆ కాన్సెప్ట్ గురించి చర్చలు కూడా జరిపారట.
బ్రహ్మీ తన మార్కు కామెడీతో, డైలాగులతో జనాన్ని కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కామెడీతో కూడిన ఆ టాక్ షోకు బ్రహ్మీ అయితేనే కరెక్ట్ గా ఉంటుందని అల్లు అరవింద్ అనుకున్నారట. అయితే, ఆరోగ్యరీత్యా బ్రహ్మానందం కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆ టాక్ షో చేసేందుకు బ్రహ్మీ ఒప్పుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.