ఇంకో ఆరు రోజుల్లో దసరా సినిమాల సందడి మొదలవబోతోంది. తొలి బొమ్మ బాలయ్యదే. ఆయన హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన ‘భగవంత్ కేసరి’ ఈ నెల 19న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడూ ఒక మూసలో సినిమాలు చేసే బాలయ్యను అనిల్ ఈసారి కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించాడని ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమైంది.
బాలయ్య సినిమాల్లో ఎప్పుడూ కనిపించే టెంప్లేట్స్ ఇందులో లేనట్లు కనిపిస్తోంది. రొటీన్ ఎలివేషన్లు, పంచ్ డైలాగులు, ఫైట్-పాట ఫార్మాట్ పక్కన పెట్టి కథ ప్రధానంగా సినిమాను నడిపించడానికి అనిల్ ట్రై చేసినట్లు కనిపిస్తోంది. అలా అని మాస్కు రుచించని విధంగా ఏమీ సినిమా తీసినట్లు లేడు. కొన్ని ఆకర్షణలు కథ ప్రధానంగా సాగుతూనే మాస్ ప్రేక్షకులను అలరించేలానూ సినిమా సాగేలా కనిపిస్తోంది.
‘భగవంత్ కేసరి’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా నడత ఎలా ఉంటుందో అనిల్ చెప్పాడు. మాస్ సినిమాల టెంప్లేట్ చేయడానికి తాను ప్రయత్నించినట్లు అనిల్ తెలిపాడు. బాలయ్య గత సినిమాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందని.. ప్రధానంగా ఇందులో భగవంత్ కేసరి అనే వ్యక్తి జర్నీనే చూస్తారని.. ఆ ఫ్లో దెబ్బ తినకుండా ఉండాలనే ఇందులో రెగ్యులర్ పాటలేవీ పెట్టలేదని అనిల్ తెలిపాడు.
సినిమా మొదలైన కాసేపటికే ప్రేక్షకులు భగవంత్ కేసరి ప్రపంచంలోకి వెళ్లిపోతారని.. చివరికి వరకు అదే మూడ్లో ఉంటారని అనిల్ తెలిపాడు. ఐతే ఈ సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించామని.. కానీ తొలి ఐదు రోజులు ఆ పాట థియేటర్లలో చూడలేరని అనిల్ తెలిపాడు. దసరా కానుకగా ఈ నెల 24న ఈ పాటను థియేటర్లలో యాడ్ చేస్తామని చెప్పాడు. సినిమా ఫ్లో దెబ్బ తినకూడదు, ప్రేక్షకులు ఒక జెన్యూన్ మూవీ చూడాలన్న ఉద్దేశంతోనే ఈ పాటను ప్రస్తుతానికి పక్కన పెట్టామని.. దీన్ని కొంచెం లేటుగా యాడ్ చేస్తామని అనిల్ తెలిపాడు.