ఆవేశం హద్దులు దాటేస్తోంది. వెనుకా ముందు చూసుకోకుండా.. తాను చేస్తున్నది మంచా? చెడా? అన్న విచక్షణ పక్కన పెట్టేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించేటోళ్లు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. తాజా వైరల్ వీడియో ఇదే కోవకు చెందినది.
దాదాపు రెండు నిమిషాలకు పైనే ఉన్న ఈ వీడియో ఆద్యంతం హద్దులు దాటేసిన అరాచకపు ఆవేశానికి ప్రతిరూపంగా చెప్పాలి. నిజంగా తప్పు చేసినప్పటికీ.. ఇష్టారాజ్యంగా బూతులు తిట్టేస్తూ.. చెయి చేసుకోవటం లాంటివి ఏ మాత్రం సరికాదు. కానీ.. అవేమీ పట్టించుకోకుండా హద్దులు దాటేసిన ఆగ్రహంతో ఒక మహిళ.. ఆర్టీసీ డ్రైవర్ ను నడి రోడ్డు మీద దాడి చేసిన యత్నం షాకింగ్ గా మారింది.
విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఒక మహిళ చేసిన ఈ అనాలోచిత చర్యను పలువురు తప్పు పడుతున్నారు. తన బైక్ కు డ్యాష్ ఇవ్వబోయిన బస్సు డ్రైవర్ పై ఆమె శివాలెత్తారు. బ్యాలెన్స్ తప్పి తాను కింద పడిపోయానంటూ చెలరేగిపోయిన ఆమె.. బస్సును ఆపేసి.. అందులోని బస్సు డ్రైవర్ సెల్ ఫోన్ బలవంతంగా లాగేసుకున్నారు. బూతులు తిడుతూ.. డ్రైవర్ పై పదే పదే చెయ్యి చేసుకున్నారు. బస్సులోకి ఎక్కి.. మహిళ చేసిన ఓవరాక్షన్ అందరిని అవాక్కు అయ్యేలా చేసింది.
ఆమె తీరును వీడియో షూట్ చేయటంతో ఆమె ఎంత దారుణంగా వ్యవహరించిందన్న విషయం లోకానికి తెలిసేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. విజయవాడ నగరంలోని కంట్రోల్ రూమ్ కు సమీపంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు తన మోపెడ్ ను ఢీ కొట్టిందన్నది ఆమె ఆరోపణ.
ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోపంతో బస్సును ఆపించింది. రోడ్డుకు మధ్యలో ఉన్న బస్సును అలానే ఆపేసిన ఆమె.. ఆవేశంతో ఊగిపోయింది. నోటికి వచ్చినట్లుగా తిట్టేసింది.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను బస్సులోనే చితకబాదేసింది. ఎంత చెప్పినా వినకుండా వ్యవహరించిన ఈ మహిళ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. వైరల్ గా మారిన ఈ వీడియోతో మహిళ వ్యవహరించిన తీరును పలువురు ఖండిస్తున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించటాన్ని తప్పు పడుతున్నారు.దీనికి సంబంధించిన ఫిర్యాదు.. తాజాగా పోలీసులకు అందటంతో దీనిపై విచారణ జరుపుతున్నారు.