ఇదో చిత్రమైన వ్యవహారం. సమయం.. సందర్భం మాత్రమే ఉన్నా.. తమకు చెందిన వ్యవహారం మా త్రం కాదు.. అయినా.. కూడా పందాలు కాసేస్తున్నారు. రూ.కోట్లకుకోట్లు చేతులు మార్చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ప్రచారం ముగిసింది. అయితే.. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? ఏ నాయకుడికి మెజారిటీ ఎంత? అనే విషయాలపై ఇప్పుడు ఏపీలో పందేలు కట్టడం ఆసక్తిగా మారింది.
ఏపీలోని అనంతపురం, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో(భీమవరం, ఆకివీడు, కాకినాడ) ఈ పందేల జోరు జోరుగా సాగుతోంది. నిజానికి గోదావరి జిల్లాలు అంటేనే పందేలకు మారుపేరు. కోడి పందేల నుంచి క్రికెట్ పందాల వరకు కూడా.. ఈ జిల్లాలకు తిరుగులేదు. కోట్లకు కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. దేశంలోని ఎక్కడివారితో అయినా.. పందేలు కట్టడం.. ఇక్కడివారికి స్పెషల్.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ గెలుపుపై పందేల రాయుళ్లు కోట్ల రూపాయల సొమ్ముతో పందేలు కట్టారనేది రాజకీయ వర్గాల మాట. ముఖ్యంగా రెండుకీలక విషయాలపై పందేలు ఎక్కువగా ఉన్నాయని.. మిగిలిన అంశాలపై తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి.. సీఎం కేసీఆర్.. గజ్వేల్‌లో గెలుస్తారా? ఓడతారా? అనేది. అదేవిధంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. రేవంత్ తన సొంత నియోజకవర్గం(గతంలో గెలిచిన) కొడంగల్‌లో ఎంత మెజారిటీ తెచ్చుకుంటారు? అనేది ప్రధాన పందం.
అదేసమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? రాదా? అనేది కూడా.. ఆసక్తికరంగా .. పందేల రాయుళ్ల మధ్య కోట్లకు కోట్లు పందేలు కాసేలా చేసింది. ప్రస్తుతం తెలంగాణ నాడిని పట్టుకోలేక పోవడం.. ప్రజలు చైతన్య వంతంగా ఉండడం.. రాష్ట్రంలో మార్పు వస్తుందా? లేక.. ఉన్నదే కొనసాగుతుందా? అనే చర్చ పీక్ స్టేజ్‌లో డిబేట్ కావడంతో ఈ విషయం మరింత ఉత్కంఠగా మారిందని అంటున్నారు. అందుకే ఈ రెండు అంశాలే కేంద్రంగా పందేలు సాగుతున్నాయని పరిశీలకులు సైతం చెబుతున్నారు.